- రామగుండం బల్దియా పరిధిలో రూ.65లక్షలతో ఐదు చోట్ల ఓపెన్ జిమ్‌లు
- రిపేర్లు అయినా పట్టించుకోని బల్దియా అధికారులు
- చలికాలం కావడంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన జనం
- ఎక్విప్‌మెంట్ ఈజీగా కదలకపోవడంతో వాకర్ల ఇబ్బందులు
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఓపెన్ జిమ్‌ల నిర్వహణపై బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుమారు రూ.65లక్షలతో రామగుండం, గోదావరిఖనిలో ఐదు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో ఎక్విప్‌మెంట్ సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఫిట్‌నెస్ కోసం పట్టణప్రజలు పార్కుల బాటపడుతున్నారు. ఈక్రమంలో ఓపెన్ జిమ్‌ల్లో పరికరాలు పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు
రామగుండం బల్దియా ప్రజల ఆరోగ్యం, శారీరక ధృడత్వం కోసం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. 2020లో పట్టణ ప్రగతి పథకంలో భాగంగా రూ.50 లక్షలతో రామగుండం బల్దియా వెనుకవైపు, ప్రభుత్వ శాతవాహన పీజీ కాలేజీ ఆవరణలో, దుర్గానగర్ లే అవుట్ కాలనీ పార్క్ వద్ద, గౌతమీనగర్ పార్క్ ఎదుట ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. మరో రూ.15 లక్షలతో జవహర్‌నగర్‌లోని సింగరేణి స్టేడియంలో 2024లో మరొకటి ఏర్పాటు చేశారు. వీటిల్లో ఎయిర్వాకర్, ఫుష్‌చైర్, ఎయిర్ స్వింగ్, షోల్డర్ వీల్, లెగ్ ప్రెస్, పుల్చైర్, స్టాండింగ్ ట్విస్టర్, డబుల్‌క్రాస్ వాకర్, సిట్టింగ్ ట్విస్టర్, తదితర ఎక్విప్‌మెంట్స్ ఏర్పాటు చేశారు.
నిర్వహణ లేక అవస్థలు
పట్టణ ప్రజలకు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరగడంతో ఓపెన్ జిమ్‌ల పట్ల ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్ చేసి, ఓపెన్ జిమ్‌లలో కాసేపు ఎక్సర్‌సైజ్ చేసేవారు. కాగా ఓపెన్ జిమ్‌ల్లోని ఎక్విప్‌మెంట్లలో గ్రీజు గానీ, ఆయిల్ గానీ పోయకపోవడం, బేరింగ్‌లు విరిగినా పట్టించుకోకపోవడంతో బిగుసుగా మారాయి.
కొన్నిచోట్ల వర్కవుట్లు చేస్తుండగా సౌండ్లు వస్తుండడంతో ఎక్సర్‌సైజ్‌పై ఆసక్తి తగ్గిపోతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత చలికాలంలో ఎక్కువగా వాకింగ్, ఎక్సర్సైజ్చేసేవారు మెయింటనెన్స్ లేని ఓపెన్‌జిమ్‌లతో కార్పొరేషన్ తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.