కూరగాయల మార్కెట్ తరలింపు .. వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం

జమ్మికుంట, వెలుగు: కూరగాయల మార్కెట్ తరలింపుపై జమ్మికుంటలో వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. జమ్మికుంట టౌన్ గాంధీ చౌరస్తాలోని మార్కెట్‌‌ను తరలించాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారని సోమవారం మున్సిపల్‌‌ సిబ్బంది షెడ్లు తొలగించేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు అడ్డుకోవడంతో సిబ్బందితో వాగ్వాదం జరిగింది. 

ఎన్నో ఏళ్లుగా ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటున్నామని, ఈ స్థలంపై కన్నేసిన కొందరు లీడర్లు.. మార్కెట్‌‌ను కూలగొట్టి పాత వ్యవసాయ మార్కెట్‌‌ ప్రాంగణంలోకి తరలించేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాపారులు మండిపడ్డారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి వ్యాపారం చేసుకునే వ్యాపారులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.