పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు

  • ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్
  • కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు
  • డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు
  • శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు.. లేదంటే కొద్దిరోజుల గ్యాప్​తో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది. సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరివారం నుంచి ఫిబ్రవరి మొదటివారంలోగా మూడుదశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్​ కమిషన్​కు చేరడంతో త్వరలోనే సర్కారుకు రిపోర్టు ఇవ్వనుంది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. పంచాయతీల పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్​లో ఉండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. మున్సిపల్​ ఎన్నిలకు ఆ సమస్య లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతోపాటే నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

నేడో.. రేపో.. గెజిట్

రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిపై నేడో, రేపో గెజిట్ విడుదల కానుంది. 

ఇందులో 129 మున్సిపాలిటీల టర్మ్ ఈ నెల 26తో ముగియనుంది. మరో 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ ఈ ఏడాది మే వరకు ఉంది. జీహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. గతంలో 138 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా 5 మున్సిపాలిటీల (పాల్వంచ, జహీరాబాద్, మణుగూరు, ఆసిఫాబాద్, మందమర్రి)కు ఎన్నికలు జరగలేదు.

మార్పులు చేర్పులు షురూ

ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటుతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది. 12 మున్సిపాలిటీల్లో కోహీర్, గుమ్మడిదల, గడ్డ పోతారం, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా).. చేవేళ్ల, మోయినాబాద్ (రంగారెడ్డి జిల్లా).. మద్దూర్ (కొడంగల్ నియోజకవర్గం) దేవరకద్ర (మహబూబ్​నగర్​జిల్లా).. కేసముద్రం, స్టేషన్ ఘన్ పూర్ (వరంగల్ జిల్లా) అశ్వారావుపేట (కొత్తగూడెం జిల్లా).. ఏదులాపురం (ఖమ్మం జిల్లా) ఉన్నాయి. వీటిలో జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై  అధికారులు కసరత్తు షురూ చేశారు. నెలరోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి కానున్నట్లు సమాచారం. మరో వైపు హైదరాబాద్ శివారులో ఉన్న 58 గ్రామ పంచాయతీలను సైతం శివారు మున్సిపాలిటీల్లో సర్కారు విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన సాగుతున్నది. ఇవన్నీ నెలరోజుల్లో కొలిక్కి రానుండగా, పంచాయతీల వెంటే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

కొలిక్కి రానున్న రిజర్వేషన్లు

లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల కులగణన చేపట్టింది. ఇందుకు సంబంధించిన డేటా ఏంట్రీ కూడా దాదాపు పూర్తయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా వారంలోగా ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఆ లెక్కనే పెరిగిన బీసీ రిజర్వేషన్ల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వవచ్చని అధికారయంత్రాంగం భావిస్తున్నది.