కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో హైడ్రా

  • ఏర్పాటుపై సర్కారుకు మున్సిపల్ శాఖ ప్రపోజల్స్
  • చెరువుల రక్షణకు సీసీ కెమెరాలు, ఫెన్సింగ్, సర్వేపై సూచనలు
  • టాస్క్​ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు
  • సీసీ కెమెరాలు ఎస్పీ, సీపీ ఆఫీసులకు అటాచ్​

హైదరాబాద్, వెలుగు : చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి వ్యవస్థ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్(ఎంఏయూడీ) తాజాగా ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 144 మున్సిపాలిటీలు, 14 కార్పొరేషన్లు ఉండగా వాటి పరిధిలో వేల సంఖ్యలో చెరువులు ఉన్నాయి. వాస్తవానికి వీటి విస్తీర్ణం వందల ఎకరాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా వరకు కుంచించుకుపోయాయి. దీంతో చెరువుల రక్షణకు ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న టాస్క్​ఫోర్స్ కమిటీలను బలోపేతం చేయడానికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తున్నది.

ఈ కమిటీలకు అదనంగా అధికారాలు అప్పగించాలని ప్రపోజల్స్ లో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జిల్లాల్లో చెరువుల రక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీలు అమల్లో ఉన్నాయి. ఈ కమిటీలో పోలీసు శాఖను కూడా చేర్చాలని సిఫార్సు చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. చెరువుల కబ్జాల నుంచి కాపాడటానికి, పోలీసు సెక్యూరిటీ మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వారి సాయం తీసుకోవాలని సూచించింది. ఆయా కార్పొరేషన్ల పేర్లతో హైడ్రా తరహా వ్యవస్థలకు పేర్లు పెట్టనున్నట్టు అధికార వర్గాల సమాచారం.

అడిషనల్ కలెక్టర్లకు బాధ్యత ఇవ్వాలి

జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇందులో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్, సర్వే చేసి చెరువు మొత్తం విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత ఉంది తేల్చాలని, కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకొని వాటిని కూల్చివేయాలని మున్సిపల్ ఆఫీసర్లు చేసిన సిఫార్సుల్లో ఉన్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో చెరువుల సర్వేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సిబ్బంది కొరత, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోకపోవటంతో ఈ పక్రియ ముందుకు సాగలేదని మున్సిపల్ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

కబ్జాలతోనే కాలనీల మునక

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నాలాలు కబ్జాకు గురవడంతో ప్రతి ఏటా వర్షా కాలంలో ఇండ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. గత నెలలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో చెరువులు తెగడం, ఖమ్మంలో మున్నేరుకు పెద్ద ఎత్తున వరద నీరు రావటంతో ఇండ్లు మునగటంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని పబ్లిక్, పలువురు కోరారు. ఈ విపత్తులకు కారణం చెరువులు కబ్జా కావటమే అని అధికారులు అంటున్నారు.

జిల్లాల్లో హైడ్రాను ఏర్పాటు చేయండి

జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సీఎంను కోరుతున్నారు. గత పదేండ్లలో జిల్లాల్లో, హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెరువులను, నాలాలను కబ్జాలు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నాలాలు కబ్జాలు చేసి పార్టీ ఆఫీసులు నిర్మించారని, చెరువులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారని అంటున్నారు. ముఖ్యంగా 14 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హైడ్రా ఏర్పాటుపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.