తప్పు ఎక్కడ జరిగినా ఎస్ హెచ్ఓలదే భాద్యత

  • మల్టీ జోన్ 2  ఐజీపీ  సత్యనారాయణ 

 సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో ఇల్లీగల్ సాండ్, మైనింగ్, పీడీఎస్ బియ్యం దందా, డ్రగ్స్, గంజాయి, గ్యాంబ్లింగ్ లకు చోటులేదని సదరు దందాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టామని  మల్టీ జోన్ ఐజీపీ సత్యనారాయణ తెలిపారు. మల్టి జోన్ 2 పరిధిలో అక్రమ దందాలను అరికట్టడంలో విఫలమైన 13 మంది ఎస్సైలు,  3 సీఐ లపై చర్యలు తీసుకున్న ఘటన పై మల్టీ జోన్ ఐజీపీ సత్యనారాయణ స్పందించారు. 

తప్పులు చేసిన సిబ్బంది మందలించినప్పటికి , వైఖరిలో మార్పు లేనందునే  చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సహా జిల్లాలోని ఆంధ్రా తెలంగాణ  సరిహద్దు కోదాడ డివిజన్ పరిధిలోని రామాపురం చెక్ పోస్టును ఐజీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేసి సూర్యాపేట జిల్లా పోలీస్ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.  జిల్లా ఇన్​చార్జి ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో న మల్టి జోన్-2 ఐజీపీ సత్యనారాయణ మాట్లాడుతూ  తప్పులు చేసిన సిబ్బంది ఏ స్థాయి వారైనప్పటికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఎక్కడ తప్పులు జరిగినా అక్కడి ఎస్ హెచ్ ఓ లనే బాధ్యులను  చేస్తామని అక్రమాలను అరికట్టడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సిబ్బందికి సూచించారు. ఇప్పటికే పోలీస్ శాఖా కఠిన చర్యల వల్ల చాలా వరకు అక్రమాలకు అడ్డుకట్ట వేశామని ఇంకా పూర్తి స్థాయిలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎక్కడికక్కడ  ఆకస్మిక తనిఖీలు , నాకాబందీలు చేపడతామని అన్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్, గంజాయి, అక్రమ ఇసుక రవాణా , ధాన్యం తెలంగాణాలోకి రాకుండా మల్టీ జోన్ 2 పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు . అక్రమాలకు సంబంధించి తమ శాఖా సిబ్బంది సహా ఎవరి పైనైనా ఫిర్యాదులు చేయాలనుకునే వారికోసం జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు. నేర రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందుకు మీడియా సహా ప్రజలంతా సహకరించాలని  కోరారు.