ఫండ్స్​ వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం.. ఎంపీ వంశీకృష్ణ సీరియస్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో  అభివృద్ధి పనులపై  అధికారులకు అవగాహన కరువైంది. కొన్ని శాఖల్లో ఫండ్స్​ ఉన్న వాటిని వినియోగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.  ఇటీవల ఎంపీ వంశీ కృష్ణ అధ్యక్షత దిశ సమావేశం జరిగింది.   జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై  చర్చించగా..  అధికారుల అలసత్వం బయటపడింది.  దీంతో ఎంపీ వారిపై సీరియస్​ అయ్యారు. ప్రతీ మూడు నెలలకు ఓ సారి జరగాల్సిన దిశ సమావేశం గత పదేండ్ల కాలంలో ఒకేసారి జరగడంతో ఆయన ఈ దిశ సమావేశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక నుంచి క్రమం తప్పకుండా దిశా మీటింగ్​ నిర్వహించాల్సిందే అని ఆదేశించారు.   అధికారులకు, నాయకులకు మధ్య కోఆర్డినేషన్​ ఉండాలని, ప్రతి పనికీ సమీక్షలు అవసరం అని తెలిపారు.   జిల్లాలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కేంద్ర, రాష్ట్రాల నిధులపై  సంబంధిత అధికారికి సరైన అవగాహన ఉండాలని, సమావేశాలకు వచ్చే ప్పుడు వివరాలతో రావాలని దిశానిర్ధేశం చేశారు. 

కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధుల గురించి, వాటి వినియోగం గురించి ఆయన అధికారులతో చర్చించారు.  దీంతో జిల్లా అధికారులు తమ శాఖ పనితీరు, వివరాల సేకరణ కోసం అలర్ట్​ అయ్యారు.  ఇదిలా ఉంటే పలువురు జిల్లా అధికారులు దిశ మీటింగ్​ నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్​ నిర్వహణ తీరు, అభివృద్ధిపనులపై వివరణ కోరిన తీరుపై ఎంపీ వంశీకృష్ణను అభినందిస్తున్నారు. 

 పదేళ్లలో ఒకేసారి...

దిశ మీటింగ్​లు స్థానిక ఎంపీ ఆద్వర్యంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి. కానీ గడిచిన పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో నామమాత్రంగా ఒకసారి నిర్వహించి వదిలేశారు. గత పాలనలో పవర్​ మొత్తం కేసీఆర్​, కేటీఆర్​ కేంద్రంగా ఉండటంతో ఎలాంటి సమాచారం, ఆదేశాలు అయినా అక్కడ నుంచే వచ్చేవి, దీంతో స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు ఎలాంటి సమీక్షలు జరిపే వారు కారు. 

దీంతో అధికారులకు కూడా అభివృద్ది పనులు, ఫండ్స్​ కేటాయింపులపై సమగ్ర సమాచారం ఉండేది కాదు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైన పది నెల్ల నుంచి  ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య బద్దంగా తమ పరిధిలో ఉన్న శాఖలపై సమీక్షలు నిర్వహించడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  చొరవతో  పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో,  యువతకు అవసరమైన ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అధికారులు అలర్ట్​...

పెద్దపల్లి జిల్లాలో ఇటీవల నిర్వహించిన దిశ మీటింగ్​తో జిల్లా అధికారులు అలర్ట్​ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ స్కీములపై చాలా మంది అధికారులకు అవగాహన ఉండటం లేదని దిశ మీటింగ్​తో స్పష్టమైంది. దిశ చైర్మన్​, ఎంపీ వంశీకృష్ణ  నిర్వహించిన సమీక్షలో చాలా మంది అధికారులు  ఎంపీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. 26 శాఖలకు సంబంధించి అధికారులతో రివ్యూ నిర్వహించగా, ప్రధానమైన శాఖలపై ఎంపీ ఫీడ్​బ్యాక్​ తీసుకున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారుల వద్ద పూర్తి స్థాయి సమాచారం లేదు. 

ప్రభుత్వ కేటాయింపులు, వినియోగంపై ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వలేకపోయారు. గతంలో ఇలాంటి మీటింగులు నిర్వహించకపోవడం మూలంగానే అధికారుల్లో అలసత్వం ఏర్పడిందని తెలుస్తుంది. దిశ మీటింగ్​  ప్రతీ మూడు నెల్లకోసారి నిర్వహిస్తామని ఎంపీ వంశీకృష్ణ,  అధికారులతో కచ్చితంగా చెప్పడంతో జిల్లా అధికారులు అలర్టయ్యారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు తమ పరిధిలోని ఉన్న పూర్తి సమాచారం, సంబంధిత అధికారుల నుంచి సేకరిస్తున్నారు.