బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలు:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో రూ. 7కోట్ల 58 లక్షలతో నిర్మించిన నూతన కూరగాయాల మార్కెట్ను ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్  పదేండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. మార్కెట్ ను నిర్మించి ప్రారంభించామన్నారు. ఎండకు వానకు రోడ్లపైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటుతో వ్యాపారుల ఇబ్బందులు తీరాయన్నారు.

 గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సోలార్ తోపుడు బండ్లు పంపిణీ చేశామన్నారు. ఇకముందు కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం  వంశీకృష్ణ. 

Also Read :- పోలీసు కస్టడీకి కొరియోగ్రాఫర్ జానీ..

నూతన కూరగాయాల మార్కెట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ. గత పదేండ్లలో రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 

తాగునీటికోసం రూ.44కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కరిస్తామన్నారు. మార్కెట్ లో స్లాట్స్ రానివారికి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్