కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు

 కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం పడిపోవాలని ప్రజలు పూజలు చేయాలని పిలుపునిచ్చారు అరవింద్. మే 4వ తేదీ శనివారం నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. మూడు నెలల తర్వాత రేషన్ కార్డుల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని ఎంపీ ఆరోపించారు. అవినీతిని పెంచి పోషించిందని.. అందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని చెప్పారు. దేశమంతా మోదీ పాలన కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు.