మూసీనది పునరుజ్జీవం చేయాలా.. వద్దా : చామల కిరణ్ కుమార్ రెడ్డి

మోత్కూరు, వెలుగు : మురికి నీటికి స్వస్తి పలికి మంచినీరు పారేలా మూసీ నదికి పునరుజ్జీవం తేవాలా.. వద్దా..? అన్నది ప్రతిపక్ష నాయకులు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ నది పునరుజ్జీవం కోసం రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం అసత్య ప్రచారాలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూసీ నది పునరుజ్జీవానికి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం అడ్డగోడూరు మండలం మానాయకుంట మూసీ నదిపై రైతులతో కలిసి భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ర్యాలీలో ఆయన పాల్గొని  మాట్లాడారు. మూసీ మురికి నీటితో రైతులు పడుతున్న గోసను చూసి సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రక్షాళనకు పూనుకున్నారని తెలిపారు. మూసీని గోదావరి జలాలతో పునరుజ్జీవం తేవడానికి కృషి చేస్తుంటే ప్రతిపక్ష లీడర్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడదామంటే ఒక్కరూ ముందుకురావడం లేదన్నారు. 

బీజేపీ లీడర్లు బండి సంజయ్, కిషన్ రెడ్డి సబర్మతి నదిని బ్రహ్మాండంగా డెవలప్ చేశామని చెప్పుకుంటున్నారని, ఆ నదిలాగానే మూసీకి కూడా జీవం పోస్తామంటే ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. మూసీ నీటితో రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏ డెవలప్​మెంట్ చేయకుండానే రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిందని విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవం పోసి చూపుతామని స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా  మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు.