వచ్చే సీజన్​లో పసుపుకు 20 వేలపైనే ధర

నిజామాబాద్​: సీఎం రేవంత్​రెడ్డి తనకు మంచి మిత్రుడని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఇవాళ నిజామాబాద్​లోని మార్కెట్​యార్డును సందర్శించి పసుపు రైతులతో మాట్లాడారు. ఇవాళ పసుపు చిన్న లాట్​కు రూ. 17,011 ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నిజామాబాలో పసుపు ధరలు రికార్డ్స్​ బ్రేక్​ చేస్తున్నాయన్నారు.  రైతుల కోరిక మేరకు  పసుపు బోర్డును పీఎం మోదీ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజుల్లో పసుపు ఎగుమతులు పెంచుతామన్నారు.  పసుపు బోర్డుకు ప్రధాని మోదీ పెద్ద టార్గట్​విధించార, ప్రస్తుతం ఉన్న ఎగుమతులను 400 శాతం పెంచాలని సూచించారన్నారు.  

ఇప్పుడు రూ.1600 కోట్ల పంట ఎగుమతులు అవుతున్నాయని, 2030 వరకు రూ. 6400 కోట్లకు పెంచాలని మోదీ టార్గెట్​ పెట్టారన్నారు. దానికి తగ్గట్టుగానే బోర్డు పనిచేస్తదని, అందుకనుగుణంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. పసుపు సంబంధ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.  కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. గుజరాత్​ మాదిరిగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటూ రేవంత్​ కోరుకోవడంలో తప్పులేదని, కానీ దానికి తగ్గట్టుగా  మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వేల్పూరులో ఉన్న 42 ఎకరాల భూమిని వెంటనే పసుపు బోర్డుకు అప్పగించాలని కోరారు.