బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

  • నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​

ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 10 మంది మంత్రులకు, 105 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించలేదని దీన్ని బట్టి బీజేపీలో పైరవీలకు చోటు లేదనే విషయాన్ని గ్రహించాలన్నారు.  పసుపు పంటను సాగు చేస్తున్న రైతులు భవిష్యత్తులో పసుపును ఎగుమతి చేయడం మానుకుని వ్యాపారం చేయడం నేర్చుకోవాలన్నారు.

పసుపు క్వింటాలుకు రూ.20 వేలు దాటుతుందని తాను చెప్పినట్లుగానే ధర లభిస్తుందని రైతులకు ఇది శుభ పరిణామమన్నారు.  అవినీతి కాంగ్రెస్​ ను నమ్మవద్దని, బీఆర్ఎస్​, కాంగ్రెస్​ ఒక్కటేనని ఆయన విమర్శించారు. మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని, చెప్పిన మాట ప్రకారం పసుపు బోర్డు మంజూరు చేయించానని అన్నారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత, అవసరం దేశానికి  ఎంతైనా ఉందని అన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యమని అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్​ తదితరులు పాల్గొన్నారు. 

ఎడపల్లి, వెలుగు: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే అంశంలో  సీఎం రేవంత్ రెడ్డి  రైతులను మభ్యపెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.  ఎడపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.  రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడం చేతగాకపోతే  రేటు ఎంతో చెప్పు.. దాన్ని కొని ప్రారంభించే వాళ్లు మా వద్ద ఉన్నారని నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని సవాల్ విసిరారు.  రైతులు పండించిన ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వనోడు.. రెండు లక్షల రుణమాఫీ చేయనోడు.. 5 లక్షల ఇండ్లు కట్టిస్తాడా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్​ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్ర కరణ్‌ ​, అసెంబ్లీ కన్వీనర్‌‌ శ్రీధర్, పార్టీ నాయకులు, సూర కిరణ్, ఉప్పు సురేశ్, తదితరులు పాల్గొన్నారు.