లోక్​సభ ఎన్నికల్లో కవిత పోటీ చేసేలా చూడాలి : అర్వింద్

  • ఒప్పించడానికి బీఆర్ఎస్​ కార్యకర్తలు ధర్నాకు దిగాలె 
  • మీడియాతో చిట్​చాట్​లోఎంపీ అర్వింద్​ 

నిజామాబాద్​, వెలుగు:  లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ  కవిత పోటీ చేసేలా హైకమాండ్‌ను బీఆర్ఎస్​ కార్యకర్తలు ఒప్పించాలని, అవసరమైతే ధర్నాకు దిగాలని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ సూచించారు. ఆమెను అలా వదిలేస్తే ఎట్లా అని, గులాబీ లీడర్లు వదిలేయడంతో తమ కార్పొరేటర్లు ఘర్​వాపస్​ అవుతున్నారని సెటైర్​ వేశారు.

మంగళవారం సిటీలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో చిట్‌చాట్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్​ఎస్​ నుంచి ఇప్పటికి ఆరుగురు కార్పొరేటర్లు  బీజేపీలోకి వచ్చారన్నారు. కేసీఆర్​ను మరిచిపోయారా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా కవిత పోటీకి వస్తాదా? లేదా? మొదట చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వంపై స్పందించేందుకు ఇంకా టైం ఉందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచేది బీజేపీనేనని కాంగ్రెస్​ సెకెండ్​, బీఆర్​ఎస్​ మూడో స్థానంలో ఉంటాయన్నారు. ఇందూరు పార్లమెంట్​ స్థానంలో తాము గట్టిగా పనిచేస్తే కాంగ్రెస్​కు కష్టమేనన్నారు. ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్‌​రెడ్డికి వార్నింగ్​ కాల్స్​ ఎక్కువయ్యాయని అర్వింద్​ అన్నారు.

ఆయనకు ఇప్పుడు కల్పిస్తున్న సెక్యూరిటీ మరింత పెంచమని సీపీని కోరతామన్నారు. మైనారిటీ ఏరియాల్లో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పర్యటనకు రిస్క్ ఉందన్నారు. తనకు రాష్ట్ర ఎస్కార్టు, భద్రత అవసరంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా కల్పించిన సెక్యూరిటీ చాలన్నారు. గతంలో బీజేపీ నుంచి గెలిచి బీఆర్ఎస్​లోకి వెళ్లిన కార్పొరేటర్లు లత, బట్టు రాఘవేందర్​ ఎంపీ అర్వింద్​ సమక్షంలో మంగళవారం తిరిగి కాషాయ కండువా ధరించారు. సుమారు 1400 మంది భక్తులతో అయోధ్యకు వెళ్తున్న స్పెషల్​ ట్రైన్​ను ఎంపీ  జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​కులాచారి, ఫ్లోర్​లీడర్​ స్రవంతిరెడ్డి, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.