22వ ప్యాకేజీ పనుల్లో కదలిక

  • పనులు పరిస్థితిని సీఎంకి  వివరించిన నేతలు 
  • నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్​ ఆఫీసర్లకు ఆదేశాలు
  • దసరా తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష
  • పనులు పూర్తియితే జిల్లాలోని రెండు నియోజక వర్గాలకు సాగునీరు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని రెండు నియోజక వర్గాలకు సాగునీరు అందించే కాళేశ్వరం 22 ప్యాకేజీ పనుల్లో కదలిక వస్తోంది. ఈ ప్యాకేజీ పనులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం దసరా తర్వాత జరగనుంది. పనులు వేగవంతం చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగు నీరు అందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  రివ్యూ మీటింగ్​ తర్వాత జిల్లాకు చెందిన ముఖ్య నేతలు  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే పనులు వేగవంతమయ్యే అవకాశముంది.

 ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు సంబంధించి మూడు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్యాకేజీ 20,21,22 పనులు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు 22వ ప్యాకేజీ ద్వారా నీళ్లు రానున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా దీనికి అప్పట్లో రూపకల్పన జరిగింది.  పనులు ప్రారంభమై 16 ఏళ్లు దాటిన 40 శాతం పనులు కూడా పూర్తికాలేదు. 

గత కాంగ్రెస్​ పాలనలోనే పనులు షురూ

 గత కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలో ప్రాణహిత -చేవేళ్ల స్కీమ్​లో చేపట్టిన ఈ పనులపై బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్యాకేజీ ప్రయార్టీలో లేకపోవటంతో కనీసం భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం ఉన్న దృష్ట్యా 22వ ప్యాకేజీ పనులను స్పీడప్​ చేసి సాగు నీరు అందించాలనే ఆలోచనలో నేతలు ఉన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజవర్గాల్లో సాగునీటి వనరులు లేక వ్యవసాయం పూర్తిగా వర్షాధారం, భూగర్భజలాల ఆధారంగా సాగుతుంది. 

 ప్రయార్టీలోకి తీసుకుంటేనే ఫలితం

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఈ జిల్లాకు సంబంధించిన  పనులను నిర్లక్ష్యం చేసింది. భూ సేకరణ చేపట్టకపోవటంతో పాటు, కాల్వల పనులను స్పీడప్​ చేయలేదు. ఈ ప్యాకేజీని ప్రయార్టీలో చేర్చలేదు.  ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న దృష్ట్యా ఈ పనుల్ని కంప్లీట్​ చేయించాలనే ఉద్దేశంతో జిల్లా నేతలు ఉన్నారు.   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు పనులను త్వరగా చేపట్టాలని కోరుతూ ఇటీవల సీఎం, ఇరిగేషన్​ మంత్రిదృష్టికి తీసుకెళ్లారు.

 సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.  ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉత్తమ్​కూమార్​రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేయాలని భావించారు.  కానీ, ఇక్కడ కాకుండా దసరా తర్వాత హైదరాబాద్​లో రివ్యూ చేయనున్నారు. పనులు త్వరగా పూర్తి కావాలంటే ఏమి చేయాలి, భూ సేకరణ తదితర ఆంశాలకు సంబంధించి రిపోర్టు ఇచ్చేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులు జిల్లా ఇరిగేషన్​ ఆఫీసర్లను సమగ్ర రిపోర్టు కోరారు.  

భూసేకరణ చేయలే

ప్రధాన కాల్వలు,  రిజర్వాయర్ల నిర్మాణం,   సొరంగమార్గం, లింక్​ కాల్వల నిర్మాణానికి  4,450 ఎకరాలు అవసరముంది.  1,255 ఎకరాలు మాత్రమే సేకరణ జరిగింది.  సదాశివనగర్​ మండలం భూంపల్లి వద్ద రిజర్వాయర్​తో పాటు,  రెండు కాల్వల నిర్మాణం పనులు కొంత మేర జరిగాయి.  నిజామాబాద్​ జిల్లాలోని 21 ప్యాకేజీ నుంచి 22వ ప్యాకేజీకి నీళ్లు వచ్చేందుకు  సదాశివనగర్​ మండలం యాచారం ఏరియాలో  సొరంగ మార్గం పనులు చేపట్టారు. 

 మెయిన్​ కెనాల్స్​కు సంబందించి సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి మండలాల్లో  పనులు కొంత జరిగాయి.  భూ సేకరణకు నిధుల కొరత ఏర్పడింది.  భూ సేకరణతో పాటు,  కెనాల్స్​ తవ్వకాలు, రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కావాల్సి ఉంది.   ప్రాజెక్టుకు డిజైన్​ చేసిన టైంలో 22వ ప్యాకేజీకి రూ.1,446 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. ఇందులో రూ.400 కోట్ల మేర పనులు జరిగాయి.   ఇప్పుడు అంచనా వ్యయం పెరిగే అవకాశముంది.