Lifestyle: అమ్మమాట వింటే కష్టాలే ఉండవు.. పీత ఎంత సాయం చేసిందో..!

అనగనగా ఒక ఊరిలో ఓ కుర్రాడు తన తల్లితో కలిసి ఉండేవాడు. అతను ఒకసారి పట్టణంలో జరిగే వేడుకలు చూడడానికి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయాన్ని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ.. అప్పుడు ఆమెకు బాగా పని ఉండడం వల్ల తన కొడుకుతో వెళ్లే పరిస్థితి లేదు. అందుకే 'నువ్వు ఒక్కడివే వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎవరినైనా తోడుగా తీసుకెళ్లు నాయనా' అని చెప్పింది. దానికి బదులుగా ఆ కుర్రాడు 'తోడు రావడానికి ఎవరూ లేరమ్మా. నేను ఒక్కడినే వెళ్తాను ఏం పరవాలేదు' అన్నాడు. ఒక్కడినే పంపడం ఇష్టంలేని వాళ్ళ అమ్మ కొడుకు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చివరకు 'కనీసం ఈ పీతను అయినా తీసుకుపో నాయనా. నీకు తోడుగా ఉంటుంది' అని ఇంటి పక్కన ఉన్న నీటి గుంటలో నుంచి ఒక పీతను తీసి ఇచ్చింది. పీతను వెంట తీసుకెళ్లడం వృథా అని తెలిసినా అమ్మ మాట కాదనలేక దాన్ని బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు. 

అలా కొంతదూరం వెళ్లిన తర్వాత అలిసిపోయి ఒక అడవిలో చెట్టు కింద పడుకున్నాడు. అంతలోనే ఆ చెట్టు తొర్రలో నుంచి ఒక పాము వచ్చింది. అది కుర్రాడిని కాటేయడానికి వస్తూ అనుకోకుండా బుట్టలోకి దూరింది. దాంతో పీత పాముతో పోరాడి, తన కోరల్లాంటి కొండ్లతో పాము మెడ కత్తిరించేసింది. నిద్రలేచిన కుర్రాడు ఆ దృశ్యాన్ని చూసి, జరిగిందంతా అంచనా వేశాడు. తన ప్రాణం కాపాడిన పీతకు కృతజ్ఞతలు చెప్పాడు. అమ్మను గుర్తు తెచ్చుకుని మనసులో నమస్కరించుకున్నాడు. 'నేను అమ్మమాట వినకుండా పీతను వెంట తీసుకురాకుంటే ప్రాణాలు పోయేవి' అనుకుని అమ్మమాట వింటే ఎప్పుడూ మంచే జరుగుతుంది అని మనసులో తలుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారే సరికి ఊరికి చేరుకుని వేడుకలు చూసి, తిరిగి ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మతో చెప్పాడు.