తల్లడిల్లిన తల్లి హృదయం..బిడ్డను నేనే పెంచుకుంటానని..పెంచిన తల్లి ఆరాటం

  • కన్నతల్లికి ఇచ్చి తిరిగి తీసుకోవడానికి విఫలయత్నం

యాదాద్రి, వెలుగు : పెంచింది కొన్ని రోజులే.. అయినా బిడ్డను తిరిగి ఇవ్వడానికి ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. గుండెలకు చిన్నారిని హత్తుకొని ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతూ.. బోరున విలపిస్తూ తల్లి ఒడికి చిన్నారిని అప్పగించింది. ఏడుస్తూనే చిన్నారి ఆరోగ్యం కోసం తెచ్చిన టానిక్​ను చూపిస్తూ ఎలా వాడాలో వివరించింది. మళ్లీ నేనే పెంచుకుంటా.. ఇవ్వండి అంటూ తల్లి ఒడి నుంచి పాపను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. ఆమెను అపడానికి భర్త ఒకవైపు.. తల్లి ఒకవైపు .. సోదరుడు మరోవైపు శతవిదాల ప్రయత్నించి తీసుకెళ్లారు.

పాప కోసం పెంచిన తల్లి ఆరాటం చూస్తున్న వారి కండ్లు చెమ్మగిల్లాయి. ఈ ఎమోషనల్​ సంఘటన యాదాద్రి జిల్లా ఐసీడీఎస్​లో జరిగింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్​తండాకు చెందిన గిరిజన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా కొడుకు కోసం ఆరాటపడ్డారు. మూడోసారి అబార్షన్​ అయింది. నాలుగోసారి ఈ ఏడాది సెప్టెంబర్​ 2న కూతురే పుట్టింది. మధ్యవర్తి సాయంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ ఎంటర్​ కావడంతో చివరకు పాపను మంగళవారం రాత్రి ఐసీడీఎస్​లో అప్పిగించడంతో శిశుగృహకు తరలించారు. కాగా, బుధవారం పాప తల్లిదండ్రులను, పెంచిన జంటను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాపను శిశుగృహకు ఇవ్వనని తానే సాదుకుంటానని కన్న తల్లి చెప్పింది. దీంతో పెంచిన తల్లిదండ్రులు పాప తమకే కావాలని పట్టుబట్టారు. పిల్లలు లేక అల్లాడుతున్న సమయంలో తమ వద్దకు చేరిన పాపతో అటాచ్​మెంట్​ఏర్పడిందని బోరున విలపించారు.

అయితే ఇలా కాకుండా చట్టప్రకారం దత్తత తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్​బండారు జయశ్రీ, మెంబర్లు స్పష్టం చేశారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని, మళ్లీ ఎవరికీ ఇవ్వొద్దని హెచ్చరించారు. అప్పటివరకు పెంచిన తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని తల్లికి ఇవ్వమని సీడబ్ల్యూసీ సూచించారు. దీంతో తానే పెంచుకుంటానని, ఎవరికీ ఇబ్బంది కలగనీయనని చిన్నారిని గుండెలకు హత్తుకొని ముఖంపై ముద్దులు కురిపించింది. చివరకు తన ఒడిలో ఉన్న పాపను కన్నతల్లికి అందించింది. పాప ఆరోగ్యం కోసం తాను తీసుకున్న జాగ్రత్తలు చెబుతూ తెచ్చిన వస్తువులను అప్పగించింది. కన్నతల్లి ఒడికి అప్పగించిన తర్వాత కూడా నా బిడ్డ నాకే కావాలని విలపిస్తూ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో భర్త, తల్లి, సోదరుడు నచ్చచెప్పి తీసుకెళ్లారు. 

పోలీసులకు సమాచారం..

చిన్నారిని అక్రమంగా దత్తత ఇచ్చిన విషయంలో కన్నతల్లి, పెంచిన తల్లి ఇచ్చిన స్టేట్​మెంట్​ను సీడబ్ల్యూసీ రికార్డు చేసింది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. తరచూ తాము ఇంటిని విజిట్ చేస్తామని, పాప విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తల్లిదండ్రులను హెచ్చరించారు.