కొడుకును కొట్టిన ఫ్రెండ్​ను హత్య చేసిన తల్లి 

  •     కత్తితో పొడవడంతో చికిత్స పొందుతూ మృతి
  •     నిజామాబాద్​ సిటీలో విషాదం

నిజామాబాద్, వెలుగు : తన కొడుకును కొట్టి గాయపర్చాడని కోపం పెంచుకున్న ఓ తల్లి అతడిని కత్తితో పొడిచి చంపింది. కొడుకు గురించి చులకనగా మాట్లాడుతూ తరచూ గొడవ పెట్టుకుంటున్నాడని ఆగ్రహంతో ఈ పని చేసింది. నిజామాబాద్​ త్రీ టౌన్​ఎస్ఐ ప్రవీణ్​​కథనం ప్రకారం.. నిజామాబాద్​లోని గౌతమ్​నగర్​కు చెందిన పవన్, చిన్ను, చందు ఫ్రెండ్స్​.

20 ఏండ్ల వయస్సున్న వీరు పెయిటింగ్ ​తదితర పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరు వారానికి ఒకసారి మందు పార్టీ ఇవ్వాలనే షరతు పెట్టుకొని ఆరు నెలల నుంచి కొనసాగిస్తున్నారు. ఆదివారం పవన్ ​వంతు రావడంతో చిన్ను, చందు వెళ్లి అడగ్గా తన దగ్గర పైసలు లేవని చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరగ్గా పవన్, చిన్నుకు చిన్నపాటి గాయాలయ్యాయి.

గాయాలతో ఇంటికొచ్చిన కొడుకు చిన్నును చూసిన అతడి తల్లి రేణుక కోపంతో పవన్ ​వద్దకు చందును తీసుకువెళ్లింది. అంతకు ముందు కూడా చాలాసార్లు కొట్టావని కుటుంబీకుల ముందు ప్రశ్నిస్తూనే వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచింది. రక్తం కారి కుప్పకూలిన పవన్​ను జీజీహెచ్​ హాస్పిటల్​లో చేర్పించగా, ట్రీట్​మెంట్​పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. రేణుక, ఆమె కొడుకు చిన్న, స్నేహితుడు చందుపై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.