పిలగాండ్లు ..కుందేలు సెల్ఫీ

వాల్తేరు అడవిలో నీటికి కొదవలేదు. ఎత్తైన జలపాతాలు ఉన్నాయి. నదులలో నీరు పాలనురగలా ప్రవహించేది. నదికి ఇరువైపులా పెద్ద పెద్ద బండరాళ్లూ ఉన్నాయి. పక్కనే అందమైన పూల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పక్కన సుజల అనే తల్లి కుందేలు నివసించేది.

            తల్లి కుందేలుకు కొంతకాలం తర్వాత సుఫల అనే బుజ్జి కుందేలు జన్మించింది. సుఫల చెంగు చెంగున గెంతుతుంటే అది చూసి తల్లి కుందేలు మురిసిపోయేది.


             సుఫల ఉత్సాహాన్ని చూసి, నెమలి, పిచ్చుక పావురం తెగ సంబరపడిపోయేవి. నెమలి పించం విప్పి ఆనందంగా నాట్యం చేసేది.పిచ్చుక ఒక కొమ్మ మీది నుండి మరొక కొమ్మ మీదికి గెంతులేసేది. జలపాతాల నుండి వచ్చే తుంపర్లు గిలిగింతలు పెడుతుంటే పావురం జలధార ల కింది నుండి వెళ్లి గిరికీలు కొట్టి వచ్చేది.


               వీటన్నిటిని చూసిన సుఫల బండరాళ్లపై పరుగులు పెట్టేది. ‘‘జాగ్రత్త..! సుఫల బండరాళ్లపై నీరు పడి, నాచు పేరుకుపోయింది. కాలు జారితే ప్రాణానికే ప్రమాదం’’ అని ఎప్పుడూ హెచ్చరించేది తల్లి కుందేలు.


           ప్రతిరోజూ నెమలి, పిచ్చుక, పావురంతో కలిసి జలపాతాల వద్దకు వెళ్ళేది. సుఫల వాటితో కలిసి పొద్దస్తమానం అక్కడే సంబరంగా గడిపేది.


            ఒకరోజు పట్టణం నుండి అంజి అనే కోతి తన అక్క తల్లి కుందేలు వద్దకు బయలుదేరింది. బయలుదేరుతూ.. బయలుదేరుతూ.. అక్క కోసం ఒక సెల్ ఫోన్ పట్టుకొని వచ్చింది. అంజి పట్టణంలో పెరగడంతో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంచుకుంది. "ప్రతిసారీ అక్కతో మాట్లాడాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది" అని సెల్ ఫోన్ తీసుకొని వచ్చింది.


         ‘‘నాకెందుకు తమ్ముడూ సెల్ ఫోన్’’ అన్నది తల్లి కుందేలు. ఆలోపే జలపాతాల నుండి వచ్చిన సుఫల సెల్ ఫోన్ చూసింది. ‘‘థాంక్యూ మామయ్యా..’’ అని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది.
         ఆరోజు నుండి ఎప్పుడూ సెల్ ఫోన్ తోనే గడిపేది. తన స్నేహితులైన పావురం, నెమలి పిచ్చుకతో కలిసి జలపాతాల వద్దకు వెళ్లి ఫోటోలు దిగేది. అవి చూసుకొని చాలా సంతోష పడిపోయేది సుఫల. తల్లి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పట్టించుకోకపోయేది.


          ఒకరోజు పావురంతో కలిసి జలపాతాల దగ్గరకు వెళ్ళింది. జలపాతం దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగడానికి పెద్ద బండరాయి వద్దకు చేరుకుంది. "అంచుల వరకు వెళ్ళకు. అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం. కాలు జారుతుంది "అని పావురం హెచ్చరించింది. ఫోటో దిగుతుండగా ఒక్కసారిగా సుఫల పట్టు తప్పింది. చూస్తుండగానే జలపాతాల వరదలో కొట్టుకొని పోయింది. పావురం కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జలపాతాల్లో ఉన్న తన మిత్రున్నే చూస్తూ పావురం సుఫల ను అనుసరించింది.


           కొద్ది దూరంలో జాలరి వల వేసి కూర్చున్నాడు. సుఫల వలలో చిక్కుకుంది. వెంటనే జాలరి సుఫలను బయటకు తీశాడు. పావురం కూడా అక్కడికి చేరుకుంది.సుఫల తడిసి పోయి భయంతో గజగజా వణికిపోయింది. వేటగాడితో జరిగిన సంగతినంతా చెప్పిందా పావురం.


         ‘‘ఫోటో అనేది ఒక మధుర జ్ఞాపకంగా మనకు ఉండాలి. కానీ ఫోటో కోసం మనమే కన్న వాళ్లకు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు’’ అని సున్నితంగా మందలించాడు జాలరి. ఆరోజు నుండి సుఫల ఫోటోల కోసం ఎప్పుడూ సాహసాలు చేయలేదు.అమ్మ మాటను వింటూ బుద్ధిగా ఉండసాగింది.
‌‌

- ముక్కామల జానకీరామ్