గురుకులాలు ఇట్లా.. చదువులు ఎట్లా?

  • అద్దె బిల్డింగుల్లోనే బడులు.. ఒకే బిల్డింగ్ లో రెండు గురుకులాలు
  • చాలని బాత్ రూమ్​ లు, విద్యార్థులకు ఇబ్బందులు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురుకులాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. చాలా స్కూళ్లు అద్దె బిల్డింగుల్లో నడుస్తున్నాయి. ఒక్కో గురుకులంలో సుమారు 500 మందికి పైగా స్టూడెంట్స్​ ఉన్నారు. వాళ్లకు తగిన సౌకర్యాలు లేవు. చాలీచాలని సిబ్బంది, అపరిశుభ్ర వాతావరణంలో చదువులు సాగుతున్నాయి. ప్రతి విద్యార్థికి కార్పొరేట్​ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించింది. కానీ, చాలా స్కూళ్లకు సొంత భవనాలే లేవు. కొన్ని స్కూళ్లు మంజూరైన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. 

ఒక నియోజకవర్గానికి చెందిన గురుకులాలు  మరో నియోజకవర్గంలో ఉన్నాయి. భద్రాద్రి జిల్లాకు మంజూరైతే ఖమ్మం జిల్లాలో నడుస్తున్న స్కూళ్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 80 గురుకులాలు ఉన్నాయి. వీటిలో బీసీ గురుకులాలు 25, ఎస్సీ గురుకులాలు 23, మైనార్టీ గురుకులాలు 17, ఎస్టీ గురుకులాలు 15 ఉన్నాయి. 

కిరాయి బిల్డింగ్​లే.. 

  • ఖమ్మం జిల్లాలో 14 బీసీ గురుకులాల్లో రెండు మాత్రమే సొంత భవనాల్లో ఉండగా, మిగిలిన 12 చోట్ల ప్రైవేట్ భవనాలే దిక్కయ్యాయి. 
  •  వైరా మండలంలోని మొత్తం ఆరు గురుకులాలు ఉన్నాయి. మూడు గురుకులాలకు ప్రభుత్వ బిల్డింగులు ఉండగా, మరో మూడు గురుకులాలను ప్రైవేటు బిల్డింగుల్లో నిర్వహిస్తున్నారు. 
  • వైరాలో బాలికల గురుకులం ఉన్న భవనాలను దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించారు. మొదట పదో తరగతి వరకే ఉండగా, ఆ తర్వాత ఇంటర్మీడియెట్ కూడా ప్రారంభించారు. అయినా తగిన కొత్త భవనాలను నిర్మించలేదు. దీంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులు అడ్జస్ట్ అవుతున్నారు. దాదాపు 80 మంది స్టూడెంట్స్​ కు బెడ్స్ కూడా లేవు. వర్షాలకు కొన్ని చోట్ల గదులు కురుస్తున్నా స్టూడెంట్స్ సర్దుకుపోతున్నారు. 
  • రెబ్బవరంలో ఒకే బిల్డింగులో రెండు గురుకులాలను నిర్వహిస్తున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, బీసీ రెసిడెన్షియల్ గురుకులాలనే ఒకే చోట నిర్వహిస్తుండడంతో, ఇక్కడ సుమారు 749 మంది విద్యార్థులున్నారు. భవన సామర్థ్యం ఒక గురుకులానికే సరిపడా ఉంది. విద్యార్థులు నిద్రించడానికి 18 డార్మటరీలు  మాత్రమే ఉన్నాయి. దీంతో గత రెండు వారాల క్రితం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రెండు గురుకులాలకు వేరు వేరు భవనాలు ఏర్పాటుచేసి, విద్యార్థులకు వసతులు కల్పించాలని డిమాండ్
  •  చేశారు.
  • వైరా నియోజకవర్గానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాలను కారేపల్లిలో మూతబడిన ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ భవనానికి ఓ వైపు ప్రహరీ గోడ లేకపోవడంతో, పాఠశాల ఆవరణలోకి పాములు, కోతులు వస్తున్నాయి. ఇక్కడ పాము కనపడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 473 మంది విద్యార్థులున్నారు. టాయిలెట్స్ ఉన్నా.. నిర్వాహన సరిగ్గా లేదు. 
  • పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో క్లోజ్ చేసిన శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో మహాత్మ జ్యోతిభా పూలె గురుకులం బాలికల, బాలుర పాఠశాలను ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. రెండు గురుకులాలకు కలిపి నెలకు రూ.4 లక్షల 80 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక్కడ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. చికెన్, మటన్, కోడి గుడ్లు సప్లై చేయడం లేదని ఫిర్యాదులున్నాయి. ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో కిచెన్ లో స్లాబ్ లీకేజీ తో పెచ్చులు ఊడి పడిపోవడంతో కిచెన్ రూములు పూర్తిగా క్లోజ్ చేసి డైనింగ్ హాల్ లోనే వంటలు సిద్ధం చేస్తున్నారు. 

ఒకే అద్దె భవనంలో ఆరు గురుకులాలు..!

మధిర మండలం కృష్ణాపురంలో ఒకే అద్దె భవనంలో ఆరు గురుకుల కళాశాలలు నడుస్తున్నాయి. బోనకల్లు, ఖమ్మం( రఘునాధపాలెం), పాలేరు(కూసుమంచి), వైరా, కుంచపర్తి, కృష్ణాపురం గురుకుల కాలేజీలు ఒకే  బిల్గింగ్​లో కొనసాగుతున్నాయి.  ఇందులో 500 మంది స్టూడెంట్లు ఉన్నారు.  ఇక్కడ టాయిలెట్లు, వాటర్ ట్యాంక్ అపరిశుభ్రంగా ఉండగా, విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు ఇంకా పంపిణీ చేయలేదు. కల్లూరు పంచాయతీ పరిధి ఎన్ఎస్పీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో మొత్తం ఉపాధ్యాయులు, లెక్చరర్స్, సిబ్బంది 40 మంది ఉన్నారు. 

ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం పురుగులుపట్టి, దెబ్బతినడంతో వాటిని బాగు చేసి వంట చేస్తున్నారు. చాలా చోట్ల గురుకులాల్లో   వసతి గదులు  సరిపోక, తరగతి గదుల్లోనే విద్యార్థులు పడుకొంటున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​ గురుకులాల ఏర్పాటుకు ప్లాన్​ చేస్తోందని, అప్పుడు అన్నింటికి సొంత భవనాలు రావొచ్చని చెబుతున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.