మహబూబాబాద్​ జిల్లాలో చెదిరిన చెరువులు

  • కట్టల శాశ్వత రిపేరు ఇంకెప్పుడో..?
  • భారీ వర్షాలతో జిల్లాలో 137 చెరువుల డ్యామేజ్​
  • శాశ్వత రిపేర్లకు రూ.24.80 కోట్లు అవసరమవుతాయని అంచనా 

మహబూబాబాద్, వెలుగు: ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన భారీ వర్షాల కారణంగా చాలా వరకు చెరువులు ధ్వంసమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో చెరువులు, కుంటలు తెగిపోయాయి. మహబూబాబాద్​జిల్లాలో మొత్తంగా 1590 చెరువులుండగా, వానకాలం సీజన్​లో వరదలతో 137  చెరువులు, కుంటలకు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టగా, అనేక చోట్ల శాశ్వత మరమ్మతులు చేపట్టవలసి ఉంది. మరికొన్ని చోట్ల రైతులు ఇసుక బస్తాలు, ఇతర ఏర్పాట్లతో చెరువుల్లోని నీరు పూర్తిగా వెళ్లిపోకుండా బుంగలను పూడ్చగా, కొన్నిచోట్ల చెరువు కట్టలు పూర్తిగా తెగిపోవడంతో చుక్క నీరు లేకుండా వెలవెలబోతున్నాయి.

భారీ వర్షాలకు తెగిన చెరువులు..

మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 37, మరిపెడ 59, నెక్కొండ30, పాలకుర్తి 8, ములుగు 3 మొత్తంగా 137 చెరువులు, ఒక చోట ఎస్సారెస్పీ కెనాల్, చెక్​ డ్యామ్​లు తెగిపోగా వాటి శాశ్వత రిపేర్లకు ఇరిగేషన్ ఆఫీసర్లు రూ.24.80 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

కాలమైనా.. కరువు తప్పలే..

వానాకాలం సీజన్​లో సమృద్ధిగా వర్షాలు కురిసినా మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు నింపడానికి జిల్లాలో నిరంతరాయంగా ఎస్సారెస్పీ జలాలను విడుదల చేస్తున్నా, చెరువు కట్టలు తెగిపోవడంతో నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. రైతుల పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేయడంతో తొలగించుకునే పనిలో నిమగ్నమయ్యారు. యాసంగి సీజన్​లోనూ సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

మత్స్యకారులకు తప్పని తిప్పలు..

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో 169 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 2500 మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, 137 చెరువుల పరిధిలో చేపలను పెంచే పరిస్ధితి లేకపోవడంతో ఆయా గ్రామాల పరిధిలో మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. 

శాశ్వత మరమ్మతులు చేపట్టాలి.. 

నెల్లికుదురు మండలం రావిరాలలో భారీ వర్షాల కారణంగా రెండు చెరువులు తెగిపోయాయి. పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది. బావుల సౌకర్యం ఉన్న రైతులు మినహా చెరువులపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగులోపే తెగిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలి. - కత్తుల రాములు, రైతు, రావిరాల గ్రామం, నెల్లికుదురు మండలం