భూపాలపల్లిలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా

  • చికిత్సల పేరుతో నిలువు దోపిడీ 
  • అప్పుల ఊబిలో కురుకుపోతున్న కుటుంబాలు
  • పట్టించుకోని వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాలా వరకు ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ ఇరుకు గదుల్లో ఏర్పాటు చేశారు. గాలి, వెలుతురు రాదు. బెడ్డుకు, బెడ్డుకు మధ్య కనీస దూరం ఉండదు. పేషేంట్‌‌అటెండెంట్ల ​కోసం ఎలాంటి సదుపాయాలు ఉండవు. కనీసం మూత్ర శాలలు, మరుగుదొడ్లు అందుబాటులో లేవు. చిన్న రూముల్లో బెడ్లు వేసి ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తున్నారు. రోగం నయం  కావడం అటుంచితే హాస్పిటల్​‌లో చేరితే కొత్త రోగాలు వచ్చే ప్రమాం ఉందని వాపోతున్నారు. 

పట్టణంలోని అంబేద్కర్‌‌ చౌరస్తా నుంచి జంగేడు రోడ్డు వైపు, మహాదేవ్‌‌పూర్‌‌ రోడ్డు వైపు, హనుమకొండ రోడ్డు వైపు ఏర్పాటు చేసిన చాలా ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ అగ్గిపెట్టల మాదిరిగా ఉన్నాయి. ఏమైనా ఎమెర్జెన్సీ ఘటనలు జరిగితే ఫైరింజన్లు కూడా హాస్పిటల్‌‌ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఉంది.  ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ యాజమాన్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇంతజరుగుతున్నావైద్యారోగ్య  శాఖ ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నో బిల్స్‌‌.. నో రూల్స్‌‌!

'ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఏ ట్రీట్‌‌మెంట్‌‌కు ఎంత తీసుకుంటారో అందరికీ తెలిసేవిధంగా బోర్డుపై రాసి ఉంచాలి' అని చట్టం చెబుతుంది. కానీ, భూపాలపల్లిలోని ఏ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు వెళ్లినా బోర్డులు కనబడవు. పేషేంట్‌‌ హాస్పిటల్‌‌కు వెళ్లగానే ఓపీ రసీదు ఇచ్చి డాక్టర్‌‌ చూసిన వెంటనే అతడికి అవసరం ఉన్నా, లేకపోయినా రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తారు. ఆ తర్వాత ఇన్‌‌ పేషెంట్‌‌గా చేర్చుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. 

ఎక్కడ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్‌‌ పాటించట్లేదు. పేషెంట్‌‌ ట్రీట్‌‌ మెంట్‌‌కు సంబంధించి ఎక్కడా బిల్స్​ఇవ్వట్లేదు. ఎవరైనా పేషేంట్‌‌ సీఎంఆర్​ఎఫ్ కోసం బిల్స్‌‌ కావాలని  అడిగితే అదనంగా డబ్బులు వసూలు చేసి బిల్స్‌‌ ఇస్తున్నారు. ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ పేరుతో ఇక్కడ ప్రతీ ఏటా రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నా పేషేంట్ల బాగోగుల గురించి పట్టించుకోవట్లేదని రోగులు అంటున్నారు. 

పదుల సంఖ్యలో గుర్తింపు లేని ఆస్పత్రులు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇందులో సింగరేణి కుటుంబాలే అత్యధికం. 30 వేల జనాభా వరకు వీళ్లే. ఆ తర్వాత ఎక్కువగా నివసించేది పేద, మధ్య తరగతి ప్రజలే. రైతు కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. భూపాలపల్లి, కాటారం కలిపి జిల్లా వ్యాప్తంగా 46 ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇవికాక గుర్తింపు లేకుండా ఇంకో పది వరకు ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

విచారణ జరిపి  చర్యలు తీసుకుంటాం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌పై విచారణ జరిపి చర్యలు 
తీసుకుంటాం. ఇప్పటికే గుర్తింపు పొందకుండా నడుపుతున్న ఆరు ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌కు నోటీసులు ఇచ్చాం. కొందరు ఎంబీబీఎస్‌‌ చదవకుండానే బోర్డులు పెట్టి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. త్వరలోనే అన్నీ ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం.- మధుసూదన్‌‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, భూపాలపల్లి జిల్లా