Health Tips: డ్యాన్స్​ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా..

బరువు తగ్గాలని శరీరాకృతి అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. అందుకోసం చాలామంది జిమ్ కి వెళ్తారు. కొందరు కష్టంగా ఉన్నా బరువులు ఎత్తుతారు. మరికొందరైతే డైటింగ్ పేరుతో బలవంతంగా నోరు కట్టేసుకుంటారు. అయితే ఇలాంటివేవీ చేయకుండానే సంతోషంగా బరువు తగ్గొచ్చు. అదెలాగంటారా? డ్యాన్స్ చేస్తూ బరువు తగ్గొచ్చు. అదీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.

డ్యాన్స్​ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే చాలా క్యాలరీలు ఖర్చవుతాయి. దీనివల్ల సులువుగా అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అందుకే డ్యాన్స్ ను  ఫిట్ నెస్ లో  భాగంగా రోజువారీ అలవాట్లలో చేర్చుకుంటే... శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు, డ్యాన్స్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ మనసును ఉల్లాసపరుస్తుంది. అయితే డ్యాన్స్లోని అన్ని భంగిమలు బరువు తగ్గేందుకు తోడ్పడవు. ఉపయోగపడే కొన్ని స్టెప్స్ ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే శరీరాకృతి ఆకర్షణీయంగా మీరనుకున్నట్టు ఉంటుంది

బ్యాలెట్​ డ్యాన్స్​:

ఈ డ్యాన్స్ శరీరానికి మంచి షేప్ ఇస్తుంది. అలాగే అవయవాలు బాగా సాగుతాయి. ఇందులోని భంగిమలు చాలావరకు యోగాసనాల్లాగే ఉంటాయి. డ్యాన్స్ చేసేటప్పుడు పెట్టే ఏకాగ్రత శరీర భాగాలు సులువుగా కదిలేలా చేస్తుంది. దాంతో శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది.

పోల్​ డ్యాన్స్​ :

పోల్ ఎక్కడం, దానిపై తిరగడం వల్ల శరీరంలో అవయవాలు కదులుతాయి. క్యాలరీలు అధిక సంఖ్యలో ఖర్చవుతాయి. ప్రతిరోజూ అరగంట సేపు... పోల్ డ్యాన్స్ చేయడం వల్ల అనేకం. ఇది జిమ్ లో ఇరవై నిమిషాలు శ్రమపడినంత ఫలితాన్ని ఇస్తుంది.

ఫ్రీ స్టైల్​ డ్యాన్స్​: 

ఈ రకమైన డ్యాన్స్ భంగిమలు శరీరాన్ని స్వేచ్ఛగా కదిలేలా చేస్తాయి. శరీర కదలికల కోసం అంటూ ఈ డ్యాన్స్ లో ప్రత్యేకంగా స్టెప్స్ ఉండవు. ఎలా కావాలంటే అలా డ్యాన్స్ చేస్తూ ఉండటమే దీని ప్రత్యేకత. ఈ ఫ్రీ స్టెల్ డ్యాన్సింగ్ శరీర బరువు తగ్గించడమే కాదు, అవయవాలను తేలికగా చేస్తుంది. ఈ డ్యాన్స్ ని పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో చేయొచ్చు. కాకపోతే జీటింగ్ వేగంగా ఉండాలి. అప్పుడే డ్యాన్సింగ్ బాగా సాగి, త్వరగా క్యాలరీలు కరుగుతాయి. ఇలా ప్రతిరోజూ కనీసం అరగంటసేపు చేయాలి.

బెల్లీ డ్యాన్స్​: 

పొట్టను ఆడిస్తూ లేదా శరీర దిగువ భాగాలను కదిలిస్తూ ఈ డ్యాన్స్ చేయాలి. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అలాగే పొట్ట,పిరుదుల్లో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది. కాబట్టి శరీర దిగువ భాగానికి వ్యాయామం కావాలనుకుంటే, ఈ డ్యాన్స్ ప్రయత్నించాలి. దీన్ని వీడియో చూసి లేదా డ్యాన్స్ స్కూల్ తరగతుల్లో ఎవరికి వాళ్లు సాధన చేయొచ్చు. దీనివల్ల శరీరం తేలికై ఫిట్ గా ఉంటారు.