ఉమ్మడి ఆదిలాబాద్​లో 60 గండాలు .. ఏజెన్సీల్లో వంతెనలు లేని వాగులు 60కి పైగానే

  • నేటికీ ఆదివాసీ గ్రామాలకు మెరుగుపడని రవాణా సౌకర్యం
  • రోడ్డు పక్కన, వాగుల ఒడ్డున గర్భిణుల ప్రసవ వేదన
  • వరదలొస్తే 300కి పైగా గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం

ఒక భీంబాయి, భారతి. అనిత.. వీళ్లే కాదు. ఎందరో ఆదివాసీ తల్లులకు ఏటా వర్షాకాలంలో ప్రసవ వేదన తప్పడం లేదు. చినుకు పడిదంటే వాగు ఒడ్డున ప్రసవాలు.. వైద్యం అందక అవస్థలు.. ప్రయాణ పాట్లు.. కాలినడకన నరకయాతన.. ఏజెన్సీ గ్రామాల్లో కనిపించే దృశ్యాలు ఇవీ.  ఏన్నో ఏళ్ల నుంచి వాగులపై బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివాసీలు వాగులు దాటాల్సి వస్తోంది. పాలకులు మారినా ఆదివాసీల బతుకులు మాత్రం మారడం లేదు.

ఆదిలాబాద్, వెలుగు:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 ఏజెన్సీ మండలాల్లో 500కు పైగా ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 60 వాగులపై వంతెనలు లేక 150కి పైగా గ్రామాల ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. మరో 150 గ్రామాల్లో లో లెవల్ వంతెనలు సైతం ఉప్పొంగి బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాయి. ఈ వాగులు దాటుతూ.. వైద్యం అందక నాలుగేళ్లలో 20 మంది మృత్యువాత పడ్డారు. 

వాగులు దాటలేని కొన్ని ఊర్లు.. 

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని చిత్తబట్ట, మామిడిగూడ, జైత్రం తాండ, జెండగూడ, గోపాల్ పూర్.. నిర్మల్​లోని కడెం మండలంలో అల్లంపెళ్లి, గంగాపూర్, ఇస్లాంపూర్, బాబా నాయక్ తాండ, రాణి గూడెం, కొర్ర తండా, కుర్రగూడెం, రేవేజిపేట్, దత్తాజీపేట గ్రామాల వద్ద ఉన్న వాగులపై వంతెనలు లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతాపూర్, కొలంగూడ, నర్సాపూర్ జే, వంకతుమ్మ,  రాజులమడుగు, చప్రాల, ఇచ్చోడ మండలంలోని నారాయణపూర్, పాలవాగు, బుర్షిగుట్ట, బాబ్జిపేట, బొజ్జుగుడ, శివగూడ, సోమన్న గూడ గ్రామాల వాగులపై వంతెనలు లేవు. నేరడిగొండ మండలంలోని సేవాదాస్ నగర్, గాజిలి, గాంధిరి, తిమ్మపూర్ గ్రామాల వద్ద ఉన్న వాగులపైనా బ్రిడ్జిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈసారి ముందే హాస్పిటల్​కు తరలించేలా..

ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో 195 రోడ్లు, వంతెనలు, కల్వర్టులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు.  వీటిని మంజూరు చేస్తే ఆదివాసీల సమస్యలు కొంతైనా పరిష్కారమయ్యే వీలుంటుంది. ఈ ఏడాది ముందస్తుగా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏజెన్సీ గ్రామాల్లోని గర్బిణీలను గుర్తించి వారిని ప్రసవ సమయం కంటే ముందే హాస్పిటల్​కు తరలించే ఏర్పాట్లు చేశారు. 

నిర్మల్​ జిల్లా పెంబి మండలంలోని పసుపుల గ్రామ వంతెన గతేడాది కడెం వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఇప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో రాయదారి, పసుపుల, అంకెన, కర్నంలొద్ది, తుల్సిపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన ఉన్న సమయంలో ఈ గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వెళ్లాలంటే 40 కి.మీ. ప్రయాణం. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు తిరిగి 80 కి.మీ. ప్రయాణిస్తున్నారు. గతేడాది ఆగస్టు 24న వాగుదాటలేక తులసిపేట్ గ్రామానికి చెందిన గర్బిణీ ఈ వాగు ఒడ్డునే ప్రసవించింది.  

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ రూరల్ మండలంలోని చిన్నుగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయికి పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్​కు తరలించారు.  గ్రామ సమీపంలోని వాగు దాటలేక గతేడాది సెప్టెంబర్ 21న అక్కడే డెలీవరీ చేశారు. 1‌08 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ వాగుదాటి అవతలివైపునకు గర్బిణీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో అతి కష్టమీద సిబ్బందే వాగుదాటి పురుడుపోశారు.

  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి వాగు 2022 జూలైలో ఉప్పొంగడంతో నాగేపల్లి గ్రామానికి చెందిన అనిత వాగు ఒడ్డునే 108 సిబ్బంది డెలీవరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. 
  • గత నెలలో ఇచ్చోడ మండలంలోని బావోజీపేట్​కు చెందిన అనితకు పురిటినొప్పులు రావడంతో రోడ్డు సదుపాయం లేక 4 కి.మీ. ఎడ్లబండిపై తీసుకెళ్లారు.

ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్ మండలంలోని కొత్తపల్లికి చెందిన ఆరు నెలల గర్భిణీ పూసం భారతికి నడుం, కడుపు నొప్పి రావడంతో గతేడాది జులై 25న హాస్పిటల్ కు బయలుదేరారు. కొత్తపల్లి వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఇలా కుటుంబసభ్యులు గంటపాటు ప్రయత్నించి అతికష్టం మీద ఏరు దాటించారు.

ఆదివాసీల బతుకులు మారలేదు

ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీల బతుకులు మారడం లేదు. ఇప్పటికీ ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు లేవు. విద్య, వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. వర్షాకాలంలో వాగులు దాటలేక రోడ్డు సదుపాయం లేక చాలా మందికి అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు. ఎంతో మంది గర్భిణులు ప్రసవ వేదనకు గురవుతున్నా పట్టించుకున్న పాపన పోలేదు. ఆదివాసీ గ్రామాల్లో కనీస సదుపాయాల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం స్పందించి ప్రతి మారుమూల గ్రామానికి రవాణా సదుపాయం కల్పించాలి. 

గొడం గణేశ్, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్