ఒక్కరోజే 30కిపైగా ఫ్లైట్లకు బాంబు బెదిరింపులు

  • వారంలో 70కి పైగా ఘటనలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ 
  • ఎయిర్ లైన్స్ కంపెనీలకు భారీగా నష్టం
  • సోషల్ మీడియా వేదికగా  బాంబు బెదిరింపులు..10 అకౌంట్లు బ్లాక్ 
  • ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు
  • బెదిరింపు కాల్స్ చేసేవాళ్లపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధం

న్యూఢిల్లీ:పలానా విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడం.. వెంటనే ఆ విమానాన్ని అత్యవసరంగా దింపేసి పూర్తిగా చెక్ చేయడం.. ఆ తర్వాత అది ఆకతాయిల పనే అని ఊపిరి పీల్చుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుండేదే. కానీ ఇటీవల విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. ఒక్క శనివారం రోజే ఏకంగా 30కిపైగా విమానాల్లో బాంబు ఉందంటూ ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా బెదిరింపు సందేశాలు పంపడంతో ఎయిర్​లైన్స్ కంపెనీల్లో తీవ్ర కలకలం రేగింది. 

ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయెన్స్ ఎయిర్ విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి మెసేజ్​లు రావడంతో ఆ కంపెనీలన్నీ తమ విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాయి. ప్యాసింజర్లను దింపేసి ఫ్లైట్లను పూర్తిగా తనిఖీలు చేయించాయి. ఒక విమానంలోని టాయిలెట్​లో ఓ బెదిరింపు లేఖ తప్ప.. మిగతా ఏ విమానంలోనూ బాంబులు దొరకలేదు. 

కానీ.. ఇలా ఒక్కో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా రూ.కోట్లలో నష్టం వాటిల్లడంతో ఆ కంపెనీలు ఆందోళనలో మునిగాయి. గత వారంరోజుల్లో మొత్తంగా 70కిపైగా ఇలాంటి ఘటనలు జరగడంతో ఇటు ఎయిర్​లైన్స్ కంపెనీలు, అటు కేంద్రం కలవరపాటుకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించి 10 సోషల్ మీడియా అకౌంట్లను అధికారులు బ్లాక్ చేశారు.

ఓ విమానం టాయిలెట్​లో బెదిరింపు లేఖ.. 

విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన సింగపూర్–ముంబై, ముంబై–ఫ్రాంక్ ఫర్ట్, ముంబై–సింగపూర్, ఢిల్లీ–బ్యాంకాక్, ముంబై–కొలంబో విమానాలకు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రొటోకాల్ ప్రకారం.. సంబంధిత అధికారులు, భద్రతా సిబ్బంది అంతా వెంటనే అలర్ట్ అయ్యారు. భద్రతా కారణాల రీత్యా ఉదయ్​పూర్–ముంబై విమానానికి కూడా ల్యాండింగ్ తర్వాత తనిఖీలు నిర్వహించగా, ఫ్లైట్ లో బాంబు ఉందంటూ ఆ విమానం టాయిలెట్ లో ఓ లేఖ దొరికింది. 

అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ముంబై–ఇస్తాంబుల్, ఢిల్లీ–ఇస్తాంబుల్, జోధ్​పూర్–ఢిల్లీ, హైదరాబాద్–చండీగఢ్ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని ఆ కంపెనీ వెల్లడించింది. అయితే, తమ విమానాలను ల్యాండ్ చేసిన తర్వాత తనిఖీలు చేపట్టగా, బాంబులు లేవని తేలిందని తెలిపింది. శుక్రవారం కూడా తమ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు మూడింటికి బెదిరింపులు వచ్చాయని, వాటిలో ఓ ఫ్లైట్​ను ఫ్రాంక్​ఫర్ట్​కు డైవర్ట్ చేశామని ఇండిగో వెల్లడించింది.

ఫ్లైట్ ఎక్కకుండా బ్యాన్ చేస్తం: కేంద్ర మంత్రి

విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు చేసే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె.రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడేవారిని పర్మనెంట్ గా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధిస్తామని, ఇతర చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అయితే, అన్ని బాంబు బెదిరింపుల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు.

ఉత్తుత్తి బెదిరింపులకు మూల్యం.. రూ. 3 కోట్లు 

ఒక్కసారి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి, తనిఖీలు పూర్తిచేసి తిరిగి పంపించాలంటే.. అన్ షెడ్యూల్డ్ ల్యాండింగ్, ప్రయాణికులకు సౌలతులు, పార్కింగ్​కు, సిబ్బందిని రీప్లేస్ చేసేందుకు, ఇంధనం.. ఇలా అన్ని ఖర్చులూ కలిపి దాదాపు రూ. 3 కోట్ల వరకూ కంపెనీలకు లాస్ అవుతుందని ఎయిర్​లైన్స్​ కంపెనీలు చెబుతున్నాయి. 

ఇటీవల న్యూయార్క్​కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం 130 టన్నుల జెట్ ఫ్యూయెల్​తో టేకాఫ్ అయింది. కానీ రెండు గంటల్లోనే బాంబు త్రెట్ మెసేజ్ రావడంతో విమానాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ 2 గంటల ప్రయాణానికి 100 టన్నుల ఇంధనం ఖర్చు కాగా.. అదంతా వృధా అయింది. ఒక్కో టన్నుకు రూ. లక్ష చొప్పున లెక్కేస్తే.. ఇంధనానికే రూ. కోటి నష్టం వచ్చింది. 

అలాగే ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానానికీ ఇలాగే బెదిరింపులు రాగా, దానిని కెనడాలోని మారుమూలన ఉన్న ఇకాలియట్ టౌన్​కు డైవర్ట్ చేశారు. దీంతో అక్కడ విమానం మూడున్నర రోజులు ఉండిపోగా.. రోజుకు 17 వేల డాలర్లు (రూ. 14 లక్షలు) చొప్పున అద్దె కట్టాల్సి వచ్చింది. మరోవైపు కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయిన ప్యాసింజర్లు కేసులు పెడుతుండటం కూడా కంపెనీలు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి.