గాజాకు మరింత సాయం చేద్దాం!

  • జీ20 సదస్సులో అధినేతల పిలుపు

రియో డీ జెనీరో: యుద్ధంతో ఏడాది కాలంగా సతమతం అవుతున్న గాజాకు మరింత మానవతా సాయం చేయాలని, అక్కడ నెలకొన్న యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జీ20 సదస్సులో దేశాల అధినేతలు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ లో యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు జీ20 సదస్సు ఒక ప్రకటనను విడుదల చేసింది.కాగా, ఈస్టర్న్  లద్దాఖ్ లో దెమ్ చోక్, దేస్పాంగ్  ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చర్చించారు.

ప్రపంచ దేశాల అధినేతలతో మోదీ భేటీ

జీ20 సదస్సులో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వివిధ దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూకే ప్రధాని కీర్  స్టార్మర్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంటో, పోర్చుగల్  ప్రధాని లూయీ మాంటెనీగ్రో, నార్వే ప్రధాని జోనాస్  స్టోర్, ఫ్రాన్స్  అధ్యక్షుడు ఎమ్మానుయేల్  మాక్రాన్ తో మోదీ సమావేశం అయ్యారు. మెలోనీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మోదీ, మెలోనీ చర్చించారు. 

ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసే ఇండియా–ఇటలీ జాయింట్  స్ట్రాటజిక్  ప్లాన్ 2025–29ను స్వాగతించారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, సెక్యూరిటీ, ఇన్నొవేషన్  రంగాల్లో కలిసి పనిచేయడంపై యూకే ప్రధాని స్టార్మర్ తో మోదీ చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భద్రత, హెల్త్ కేర్ పై మోదీ చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై మోదీ, ప్రబోవో మాట్లాడుకున్నారు. పోర్చుగల్  ప్రధాని లూయీ మాంటెనీగ్రో, నార్వే ప్రధాని జోనాస్ గర్  స్టోర్ తో పునారుత్పాదక ఇంధనం, గ్రీన్  హైడ్రోజన్, రక్షణ రంగాలపై మోదీ చర్చించారు. ఫ్రాన్స్  అధ్యక్షుడు ఎమ్మానుయేల్  మాక్రాన్ తో అంతరిక్షం, ఏఐ తదితర రంగాల్లో కలిసి పనిచేయడంపై చర్చించారు.