- 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు
- 51 వేల ఎకరాలల్లో సోయాబీన్
- మొక్కజొన్న 41 వేల ఎకరాలు
- పసుపు 19,606 ఎకరాల్లోనే సాగు కు సిద్ధం
- తగ్గిన కూరగాయల సాగు
- మొత్తం 5.52 లక్షల ఎకరాల్లో పంటల ప్రణాళిక
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో వానాకాలం పంటల ప్లాన్ సిద్ధమైంది. వాతావరణం, సీడ్ లభ్యత, మార్కెటింగ్ సౌలత్, భూసారం, సాగునీరు, పంటల పట్ల రైతుల ఆసక్తి, అందుబాటులో ఉండే వనరులను చూసుకొని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు సీజన్ ప్రణాళిక రూపొందిస్తారు. గత అనుభవాలను బేరీజు వేసుకొని వ్యవసాయాధికారులు ఓ అంచనాకు వస్తారు. జిల్లాలో మొత్తం 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు భూములున్నట్లు లెక్క తేల్చారు.
గతేడాదితో పోలిస్తే వరి తర్వాత సోయాబీన్, మొక్కజొన్న, పత్తి సాగు కాస్త పెరగనుంది. ఈ ఏడాది రైతులకు పసుపు లాభాలు కురిపించింది. అయినా విస్తీర్ణంలో పసుపు సాగును పెంచలేదు. కంది పంట విస్తీర్ణం కొంత పెరగ్గా కూరగాయల సాగును తగ్గించారు.
వరికి టాప్ స్థానం
వానాకాలం సీజన్ లో 4.30 లక్షల ఎకరాల్లో వరి పంట పండనుంది. గత ఏడాది కంటే సుమారు ఐదు వేల ఎకరాల విస్తీర్ణం ఈసారి పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు చేసే జిల్లాగా గుర్తింపు పొందిన నిజామాబాద్ సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి అని అంచనా తయారు చేశారు. ఇందులో సన్నాలు 70 శాతం, 30 శాతం దొడ్డరకం వడ్లు ఉండే ఛాన్స్ ఉంది.
తెలంగాణ స్టేట్, నేషనల్ సీడ్ కంపెనీల వద్ద విత్తనం రెడీగా ఉన్నా ఈ సారి కూడా అదే స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల నీటితో దుక్కులు షురూ చేశారు. నారు మడి పోస్తున్నారు. జూన్ నెలలో తొలకరి మొదలుకాగానే నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
సోయాబీన్‌కు సెకెండ్ ప్లేస్
సోయాబీన్ 51,478 ఎకరాలతో సాగు కానుంది. జూన్‌లో వర్షా కాలం షురూ కాగానే రైతులకు సీడ్ అందుబాటులో ఉండేలా అగ్రికల్చర్ ఆఫీసర్లు కంపెనీలతో చర్చించారు. గతేడాది మాదిరి ఈసారి 41,909 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు అవకాశాలున్నాయి. 2,762 ఎకరాల్లో పత్తి సాగు కానుంది. కంది పెరిగి కూరగాయల సాగు తగ్గనుంది. ప్రజలలో అధిక డిమాండ్ ఉన్న కంది పప్పు సాగును ఈ సీజన్లో 1,444 ఎకరాలకు పెంచారు.
గత సంవత్సరం 756 ఎకరాలలో మాత్రమే ఉన్న కందిని డబుల్ చేశారు. దాని స్థానంలో కూరగాయల సాగు తగ్గంది. కేవలం 900 ఎకరాలలో మాత్రమేకూరగాయల పంటలు ఉండే అవకాశం ఉంది. మినుములు, పెసర సీడ్ అందుబాటులో ఉన్నా ఈ పంట వేయడానికి రైతులు ముందుకు వస్తారా? లేదా అనేది చూడాల్సి ఉంది.
పసుపు పెరగలే..
జిల్లాలో ఈ ఏడాది పసుపు క్వింటాల్ రేట్ రూ.20 వేల దాకా పలికింది. రైతుకు లాభదాయకమైన పంట సాగు పెరగడానికి పుష్కలమైన అవకాశాలున్నట్లు చర్చ జరిగినా గతేడాది మాదిరి కేవలం 19,606 ఎకరాల్లో మాత్రమే పసుపు పండుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. లేబర్ షార్టేజ్ తదితర అంశాలు ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు. 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం.
ఖరీఫ్ సీజన్ మొత్తానికి జిల్లాకు 75,880 మెట్రిక్ టన్నులు యూరియా కావాలి. డీఏపీ 16,490 టన్నులు, ఎంవోపీ 12,319 టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 40,833 అవసరమని ఆఫీసర్లు గవర్నమెంట్‌కు నివేదించారు. ఇందుకు అనుగుణంగా సరఫరా చేయడానికి రెఢీగా ఉన్నారు.
సీజన్ షురువైంది
బాల్కొండ, ఆర్మూర్ ఏరియాలు మినహా జిల్లాలో ఖరీఫ్ సీజన్ పనులు రైతులు మొదలు పెట్టారు. దుక్కులు దున్ని వరినారు రెడీ చేసుకుంటున్నారు. రైతులకు అవసరమైన సహకారం ఇవ్వడానికి మా శాఖ ప్రిపేర్‌గా ఉంది.
మార్క్‌ఫెడ్ వద్ద ప్రస్తుతానికి10 వేల టన్నులు బఫర్ స్టాక్‌గా మరో 10 వేల టన్నుల యూరియా ఉంది. సింగిల్ విండోలకు సప్లై కాగానే రైతులు కొనుగోలు చేయొచ్చు. సీజన్ మొత్తానికి అవసరమైన ప్లాన్ ప్రకారం ఏ షార్టేజ్ లేకుండా అన్నింటినీ సమకూరుస్తాం.
– వాజీద్ హుస్సేన్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్