నిర్మల్ జిల్లాలో కోతులు.. ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే..

  • వరుస దాడులతో జనం బెంబేలు
  • వీధులన్నీ గుంపులతో హల్​చల్
  • బెదిరిస్తే ఎదురు దాడి.. రీసెంట్​గా మహిళ మృతి
  • ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు
  • మంకీ రెస్క్యూ సెంటర్ ను పట్టించుకోని పాలకవర్గం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. పండ్లు, కూరగాయల సంచులు, తిండి పదార్థాలతో కనిపిస్తే వారి వెంటపడి గాయపరుస్తున్నాయి. సోమవారం ఖానాపూర్ పట్టణంలో కోతులు ఓ మహిళ వెంటపడి ఆమె మరణానికి కారణమైన సంఘటన మరోసారి కలకలం రేపింది. జిల్లాలో ప్రతిరోజు 50 మందికి పైగానే కోతుల దాడుల్లో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఐదారు నెలల నుంచి కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

బెదిరిస్తే ఎదురు దాడి

గ్రామీణ ప్రాంతాల్లోనే గాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ కోతుల బీభత్సం కొనసాగుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ గంటల తరబడి హల్​చల్​చేస్తున్నాయి. దీంతో జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చేతిలో కర్ర లేకుండా గల్లీల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. ఎవరైనా బెదిరిస్తే పదుల సంఖ్యలో కోతుల గుంపులు వచ్చి ఎదురుదాడి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంపులుగా చేరి పంట చేలను సైతం నాశనం చేస్తుండడంతో వాటిని అడ్డుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు.

మూడున్నరేండ్ల నుంచి 2 వేల లోపే స్టెరిలైజేషన్లు

నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని చించోలి బీ గండి రామన్న హరితవనంలో 2020లో ఏర్పా టు చేసిన కోతుల పునరావాస కేంద్రంలో ఇప్ప టివరకు 2 వేల లోపు కోతులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని కోతులను పట్టుకొని ఈ కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. స్టెరిలైజేషన్లు కాగానే వాటిని తిరిగి అదే ప్రాంతానికి పంపుతారు.

పట్టించుకోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు

కోతుల నుంచి రక్షించే విషయంలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కోతులను మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలు పట్టుకొని నిర్మల్​లోని కోతుల పునరావాస కేంద్రానికి తరలించాల్సి ఉన్నప్పటికీ అలా చేయడంలేదు. కోతులను  పట్టడం కాస్ట్లీ వ్యవహారంగా మారడం, పట్టేవారు అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల నుంచి దాదాపు 500 కోతులను పునరావాస కేంద్రానికి బర్త్​ కంట్రోల్​ ఆపరేషన్ కోసం తీసుకువచ్చినట్లు ఇక్కడి పశువైద్యాధికారి తెలిపారు. కానీ నిర్మల్ జిల్లా నుంచి మాత్రం ఇలా తీసుకురాలేకపోతున్నారు.

ప్రతిరోజు 50 మంది గాయపడుతున్నారు

పోతుల దాడులతో గాయపడి చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య గతంలో 20 ఉంటే ఇప్పడు ఆ సంఖ్య 50 దాటుతోంది. వారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి ట్రీట్​మెంట్ అందిస్తున్నాం.- డాక్టర్ గోపాల్ సింగ్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, నిర్మల్