మంకీపాక్స్​తో జాగ్రత్త.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  •     మంకీపాక్స్ బాధితులను ఐసోలేషన్ చేయండి
  •     రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన కేంద్రం

న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్ (ఎం పాక్స్‌‌) కేసులు శుక్రవారంతో మూడుకు చేరుకున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన ‘క్లేడ్ 1బీ ఎంపాక్స్’ వేరియంట్ బారినపడ్డాడు. ఈ వేరియంట్ వెలుగుచూసిన మూడో నాన్ ఆఫ్రికన్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఐసోలేషన్ చేయాలని సూచించింది. ఇతరులకు వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి హాస్పిటల్​లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ‘‘క్లేడ్ 1 వేరియంట్ పెద్దవారిలో క్లేడ్ 2ని పోలి ఉన్నది. క్లేడ్ 2తో పోలిస్తే క్లేడ్ 1బీ చాలా ప్రమాదకరం. క్లినికల్ మేనేజ్​మెంట్ ప్రొటోకాల్ పాటించాలి. కఠినమైన ఐసోలేషన్ ఏర్పాటు చేయండి.  రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్త్ డిపార్ట్​మెంట్ అధికారులు వ్యాధి తీవ్రత, అనుమానిత కేసులపై రివ్యూ చేపట్టాలి. బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్​లో సౌలత్​లు ఏర్పాటు చేయండి’’ అని కేంద్రం తెలిపింది. మంకీ పాక్స్ అనుమానిత వ్యక్తులతో దగ్గర ఉన్న వారిని కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించాలని సూచించింది.

ఎర్నాకుళం వ్యక్తికి పాజిటివ్

కేరళలో మరో మంకీ పాక్స్‌‌ కేసు నమోదైనట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్నాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి మంకీపాక్స్‌‌ లక్షణాలతో హాస్పిటల్​లో చేరినట్లు తెలిపారు. అతని నమూనాలను టెస్టుల కోసం పంపించగా.. పాజిటివ్‌‌గా తేలిందని చెప్పారు.