PCB: కెప్టెన్‌గా బాబర్ అజామ్ రాజీనామా.. రిజ్వాన్‌కు పాకిస్థాన్ పగ్గాలు

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పాకిస్థాన్.. వన్డే, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టేందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడంతో బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త కెప్టెన్ ను వెతికే పనిలో ఉంది. ఇందులో భాగంగా  వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు.
 
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ అనుభవమున్న ఆటగాడు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వికెట్ కీపర్ కావడం అతనికి కలిసి వస్తుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో తమ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ ను కెప్టెన్ గా అద్భుతంగా నడిపించాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రిజ్వాన్ కు కెప్టెన్సీ ఇవ్వనున్నట్టు సమాచారం. అతను కెప్టెన్ అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ALSO READ | IND Vs NZ, 1st Test: మన చేతుల్లోనే మ్యాచ్.. బెంగళూరు టెస్టుకు వర్షం అంతరాయం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సెలెక్టర్లు ఇటీవల పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఖరారు చేయడానికి వైట్-బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ నుండి సలహా కోరారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు అక్టోబర్ 28న ముగుస్తుంది. ఆ తర్వాత రోజే పాకిస్థాన్ ఆస్ట్రేలియాలో పర్యటించాలి. దీనికి సంబంధించిన పాక్ జట్టును మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ తో పాటు జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై పాక్  వైట్ బాల్ సిరీస్ ఆడుతుంది.