మోదీ ‘సహకార సమాఖ్య’ విజయమిది!

‘సబ్‌‌కా సాథ్, సబ్‌‌కా వికాస్, సబ్‌‌కా విశ్వాస్, సబ్‌‌కా ప్రయాస్’ నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. మనసా, వాచా, కర్మణా అమలు చేస్తోంది. పేద, దళిత, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, అన్నదాతలు, కార్మికులు, చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, శాస్త్రవేత్తలు,  ప్రభుత్వ రంగ సంస్థలతోపాటుగా.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఇందులో భాగంగా.. గత పదేండ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ.. ఉద్యోగలోకం మనస్ఫూర్తిగా హర్షించింది. దీంట్లో భాగంగానే రెండ్రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల.. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 24 గంటల్లోపే.. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పథకాన్ని తీసుకొస్తామని నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం ‘సహకార సమాఖ్య’ విధానంలో సాధిస్తున్న విజయంలో మరో మైలురాయిగా నిలిచింది. గతంలోనూ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచడం, రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిపై పారదర్శకంగా ఉండేలా చొరవ తీసుకోవడం వంటి ఎన్నో నిర్ణయాలు మోదీ ప్రభుత్వ ‘సహకార సమాఖ్య’ విధాన నిబద్ధతకు ప్రతిబింబంగా నిలిచాయి. తాజాగా తీసుకున్న ఈ UPS నిర్ణయం కూడా ఈ విధానంలో వేసిన మరో ముందడుగుగా గమనించాలి.  

2023లో ఆర్బీఐ బులెటిన్ 

OPS పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులను ముందుగానే సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. దీంతో, ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత.. పెన్షన్​ ఇవ్వాల్సిన సమయంలో ఉన్న ప్రభుత్వాలు నిధులు సమకూర్చలేక రోడ్డున పడే పరిస్థితి వస్తే రానీ.. మాకేం సంబంధం అనే రీతిలో పైన పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఇలాంటి నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాలను బయటపడేసేందుకు ఆర్బీఐ 2023 సెప్టెంబర్‌‌లో ఓ బులెటిన్ విడుదల చేసింది. ‘OPS ప్రకారం చెల్లింపులు చేస్తున్నప్పుడు.. ఆయా రాష్ట ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది.

ఇది ఒక్కోసారి NPS (న్యూ పెన్షన్ స్కీమ్) కంటే 4.5 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలు మళ్లీ OPSను అమలు చేయడమే ఉత్తమమని భావిస్తే.. అది ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.  ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన UPS నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని.. UPS తరహాలో తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడటంతోపాటుగా..  రాష్ట్రాలు మౌలికవసతులపై దృష్టిపెట్టి ఉపాధి అవకాశాలను మరింతగా పెంచుకునేందుకు వీలు కలగనుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షలను సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లడం రాష్ట్రాల ముందున్న కీలకమైన అంశం. 

ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

విపక్ష పార్టీలు UPS నిర్ణయానికి భిన్నమైన రాగాలను ఆలపిస్తున్నాయి. దేశ భద్రత, ఆర్థిక విధానాలు మొదలైన.. జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కానీ, దురదృష్టవశాత్తూ మన దేశంలో ఇలా జరగడం లేదు. UPS పథకం.. ఇటు ప్రభుత్వాలకు అటు ఉద్యోగులకు ఎంతో మేలు చేకూర్చే అంశం. దేశ ప్రగతిలో తమ జీవితాన్ని ధారపోసిన ఉద్యోగులకు.. రిటైర్మెంట్ తర్వాత న్యాయబద్ధంగా అందాల్సిన గౌరవాన్ని కల్పించడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. 

ఈ దిశగా తీసుకుంటున్న సంస్కరణలకు కొనసాగింపుగానే.. ఉద్యోగుల వాటా చెల్లింపుతోపాటుగా.. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్కరణలు చూడటానికి చిన్నవిగానే కనిపిస్తాయి. కానీ, వీటి ఫలితం చాలా విస్తృతంగా ఉంటుంది. రాష్ట్రాలు ఒకేసారి పెద్దమొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వ వాటా, ఉద్యోగస్తుల వాటా నిధులను రాష్ట్రంలో మౌలికవసతుల కల్పనకు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణకు బాటలు వేస్తుంది. అందుకే ఇది మోదీ ప్రభుత్వం ‘సహకార సమాఖ్య విధానాన్ని’ మరింత బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న మరో విజయాత్మకమైన ముందడుగు.

మూలవేతనంలో 50% పెన్షన్​

UPS పథకం ద్వారా ఉద్యోగులకు జరిగే లబ్ధి గురించి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు, ఉద్యోగులకు వివరించారు. రిటైర్మెంట్‌‌కు ముందు ఏడాదిలో తీసుకున్న మూలవేతనంలో 50%  పెన్షన్​గా లభిస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాను 14.5% నుంచి 18%కు పెంచింది. ఇదికాకుండా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రూ.10వేల కనీస పింఛను అందించడం రిటైరైన ఉద్యోగస్తులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌‌పేయి ఉద్యోగుల సంక్షేమాన్ని, ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థల్లో క్రమశిక్షణను ఆకాంక్షిస్తూ.. తీవ్రమైన మేధోమథనం తర్వాత తీసుకొచ్చిన 2 సంస్కరణల ఆధారంగా తీసుకోబడింది. 

ఉద్యోగులు తమ వేతనం నుంచి.. భవిష్యత్తులో  పెన్షన్ కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం మొదటి అంశమైతే.. ఉద్యోగులకు భవిష్యత్ పెన్షన్ కోసం ప్రభుత్వమే కొంతమొత్తం నిధులను పక్కన పెట్టడం రెండో అంశం. UPSను తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. సహకార సమాఖ్య విధానంలో వేసిన మరో పెద్ద ముందడుగు. దీనిపై మరింత సమాజంలో విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో రాజస్థాన్, చత్తీస్‌‌ గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు (ఇటీవలే  రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే) 2003కు ముందు తీసుకున్నటువంటి ‘ఓల్డ్ పెన్షన్ స్కీమ్’ (OPS)నే అమలు చేయాలని పట్టుబట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయా ప్రభుత్వాల వక్రబుద్ధికి, కుట్రపూరిత ఆలోచనకు ఇదొక నిదర్శనం. 

రాష్ట్ర ప్రభుత్వాలకుకేంద్ర రుణసహాయం

కరోనా అనంతర పరిస్థితుల్లో రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని స్పృశిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ, మూలధన పెట్టుబడి కోసం అందించే ప్రత్యేక సహాయాన్ని 8 రెట్లు పెంచింది. దీని ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన పెట్టుబడి ప్రాజెక్టుల కోసం 50 ఏండ్ల వరకు వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్లను కేంద్రం అందించింది.ఈ ఏడాది బడ్జెట్‌‌లో ఈ రుణసహాయం మొత్తాన్ని రూ1.3 లక్షల కోట్లకు కేంద్రం పెంచింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు..తమ బడ్జెట్‌‌లో మూలధన వ్యయం కేటాయింపులు చేసిన తర్వాత.. అవసరమైన మిగిలిన మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న ఈ ప్రత్యేక సహాయం నుంచి నిధులను వినియోగించుకునేందుకు వీలుంటుంది. 

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సుస్థిరత, పారదర్శకతను తీసుకొచ్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs) వంటి సంస్థలు బడ్జెట్ బయట, బడ్జెట్​లో నమోదు చేయని రుణాలను తీసుకున్న రుణాలను బడ్జెట్ లెక్కల్లో చూపించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా తెలంగాణలో గత ప్రభుత్వాలు చేసిన ఆర్థిక అవకతవకలను, లొసుగుల కారణంగా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైన పరిస్థితులు ఇకపై జరగకుండా అరికట్టేందుకు వీలవుతుంది.