సమాఖ్య స్ఫూర్తిపైనే మోదీ సర్కార్​ మనుగడ

భారత ప్రజాస్వామ్యం ఏకపక్షం కాకూడదని బలంగా కోరుకున్న ఓటర్లు పార్లమెంటు ఎన్నికల్లో విజ్ఞతతో  ప్రజాతీర్పును ఇచ్చారు.  ఏ ప్రభుత్వమైనా తమకు మెజార్టీ ఉన్నదని  ప్రతిపక్షాలను గౌరవించకుండా ఏకపక్షంగా పరిపాలించడం సరికాదు.  తాజా ఫలితాలు  ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగానే 2023 డిసెంబర్​లో  తెలంగాణలో  రాష్ట్ర అసెంబ్లీకి  జరిగిన ఎన్నికల్లో,  2024 మేలో  ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో,  దేశవ్యాప్తంగా లోక్​సభకు జరిగిన ఎన్నికలోనూ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు.  భారతదేశ పార్లమెంటుకు 2024లో జరిగిన ఎన్నికల్లో  గత పది సంవత్సరాలుగా మెజార్టీ ఉన్నదని  ఏకపక్షంగా విధానాలు చేపడుతున్న బీజేపీ  నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మెజార్టీని తగ్గించి గుణపాఠం చెప్పారు.  నేడు ఏర్పడిన  ఎన్డీఏ  ప్రభుత్వం సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ  ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని,  ప్రజలు ఆకాంక్షిస్తూ పట్టం కట్టారు.  ఇచ్చిన వాగ్దానాలు  నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, అంతేకాదు సమాఖ్య స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ  రాష్ట్రాలను కలుపుకొని వెళ్తేనే మనుగడ సాధిస్తామనేది  కాదనలేని వాస్తవం.  సంకీర్ణ రాజనీతి ప్రదర్శిస్తేనే దేశానికి క్షేమదాయకమని ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి.

న రేంద్ర మోదీ నాయకత్వాన 71మంది మంత్రులతో  (60 బీజేపీ+11ఎన్డీఏ)  సంకీర్ణ  ప్రభుత్వం కొలువుదీరింది.  కేటాయించిన కీలక శాఖలన్నీ బీజేపీ నేతల చేతుల్లో పెట్టారు.  బీజేపీని బలపరు
స్తున్న  ప్రాంతీయ పార్టీలకు తగిన గౌరవం దక్కలేదని విమర్శలు వస్తున్నాయి.  240 ఎంపీ స్థానా
లతో  పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రాంతీయ పార్టీల సహకారం లేకపోతే ప్రభుత్వం ఏర్పడేది కాదు. ప్రాంతీయ  పార్టీలను గౌరవించాల్సిన బాధ్యత జాతీయ పార్టీయైన బీజేపీపై ఉన్నది. ఇదే విషయాన్ని 2024 లో జరిగిన లోక్​సభ  ఎన్నికలలో  జాతీయపార్టీలని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రాంతీయ పార్టీలను ఆదరించేలా గుర్తించాల్సి వచ్చింది. 2019లో జరిగిన 17వ సభ  ఎన్నికల కన్నా 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల సహకారం,  ఫెడరలిజం విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నది. ఈ ఎన్నికలలో ప్రధాని మోదీ నాయకత్వాన బీజేపీకి సొంత బలం 303 నుంచి 240కి పడిపోయింది. 53 స్థానాలతో ప్రాంతీయ పార్టీలు అండగా నిలవకపోతే బీజేపీ మరొకసారి అధికారానికి రాగల అవకాశమే ఉండేది కాదు.

ఫెడరల్​ శక్తులకు తిరుగులేదు.. 

మొత్తం 543 మంది సభ్యులు గల లోక్​సభలో (240 బీజేపీ +99 కాంగ్రెస్​) ఇతర పార్టీల బలం 188 నుంచి 204కు పెరిగింది. మొదటిసారి 1977లో  జనతాపార్టీ పేరిట ఫెడరల్ శక్తుల కూటమి కేంద్రంలో అధికారానికి వచ్చింది. ఆ తర్వాత 47 సంవత్సరాల పాటు మధ్య మధ్యలో చిన్నపాటి మద్దతుతో ఫెడరల్ శక్తులు ప్రభుత్వాల ఏర్పాటుకు కీలకం అవుతూనే వస్తున్నాయి.  ఇప్పుడు 2024లో  కనిపిస్తున్నది కూడా అదే.  జాతీయత పేరిట అధికారాన్ని తమ చేతిలో  కేంద్రీకృతం చేసుకోవడంలో,  రాష్ట్రాల హక్కులను హరించటంలో, ధనిక వర్గాల కోసం అంతర్గత వలసలను, అసమానతలను ప్రోత్సహించటంలో మొదట కాంగ్రెస్, ఆ తరువాత బీజేపీ ఒకదానికొకటి తీసిపోలేదు. ఈ క్రమంలో  వారిద్దరూ అన్ని రాజ్యాంగ వ్యవస్థలను సైతం బలహీనపరిచారు. అయినప్పటికీ, ఈ దేశ వైవిధ్యత, ప్రజల ఆకాంక్షలే తమ బలంగా గల ఫెడరల్ శక్తులు  అన్ని ఒడిదొడుకులను తట్టుకుంటూ నిలబడ్డాయి.  దీనికి ఈ 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలే  నిదర్శనం. ప్రస్తుత  బీజేపీ  నాయకత్వంలోని ఎన్డీఏ  ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాలను  కలుపుకొని ముందుకు వెళ్తేనే  మనుగడ సాగిస్తుందనేది కాదనలేని వాస్తవం.

ప్రాంతీయ పార్టీల అండతోనే.. మూడోసారి మోదీ సర్కారు

ఇండియా కూటమికి 234 స్థానాలురాగా ఇందులో  కాంగ్రెస్ పార్టీ గెలిచినవి 99 మాత్రమే.  మిగిలిన 135 స్థానాలు ఫెడరల్ శక్తులవి కావటం గమనార్హం.  ఇందులో మరొక విషయం  కాంగ్రెస్ బలం 2019 నాటి 52 కన్నా దాదాపు రెట్టింపు అయిందని పలువురు ఆ పార్టీని, పార్టీ నాయకులని పొగుడుతున్నారు. కానీ, ఆపార్టీ పొందిన 99 ఎంపీ స్థానాలో సుమారు 40 సీట్లు ఆయా రాష్ట్రాల్లోని ఫెడరల్ పార్టీలతో పొత్తుల వల్ల గెలిచినవి మాత్రమే. అంటే ఒంటరిగా బలం పెంచుకున్నది నామమాత్రమే అని చెప్పాలి. యూపీ, మహారాష్ట్ర,  బిహార్, తమిళనాడు  మొదలైన చోట్ల పొత్తులు లేనట్లయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉండేదో  ఎవరైనా ఊహించవచ్చు. అదే పద్ధతిలో 2014 నుంచి మెజారిటీ  స్థానాలు పొంది అధికారంలో ఉన్న జాతీయ పార్టీయైన బీజేపీకి కూడా  ఒక మేరకు ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాల వల్లనే 240 స్థానాలు లభించాయి.  రెండు జాతీయ పార్టీల  బలాబలాలను విశ్లేషించి..ఫెడరల్ పార్టీల గెలుపు కన్నా 204 సీట్లను ( ఎన్డీఏలోని 53, ఇండియా  కూటమిలోని 135, ఈ కూటమిలో లేని పార్టీలు, వ్యక్తులు కలిపి 16) చూసినట్లయితే పరిస్థితి ఏమిటో  బోధపడుతుంది.  ఏపీలో టీడీపీ-, జనసేనతో కలిసి బీజేపీ 3 స్థానాలు దక్కించుకొన్నది. ఆంధ్రప్రదేశ్​లో   పొత్తు లేకపోతే స్వయంగా గెలవడం అంటూగాని,  టీడీపీ, జనసేన పార్టీల 18 స్థానాలు తోడవడంగాని ఉండేది కాదు. అప్పుడు  ఎన్డీఏ బలం  కనీసం మెజార్టీ అయిన 272 దగ్గర  బొటాబొటీగా ఆగిపోయేది. 

ప్రధాని మోదీ వైఖరిలోమార్పు రావాలి 

 కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  ఇంతకుముందు చాలా విషయాలపై ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా మొండిగా వ్యవహరించింది. తనకున్న మెజారిటీ సభ్యులతో చర్చలు లేకుండానే, ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా అనేక బిల్లులు ఏకపక్షంగా ఆమోదించుకొన్నది. రైతాంగ  'వ్యవసాయ చట్టాలకు'  వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసిస్తున్నప్పటికీ మొండిగా వ్యవహరించింది.  పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగిన తర్వాతనే మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. అదేవిధంగా సైనిక నియామకాల అగ్నివీర్  సిస్టమ్​ను  పెద్ద ఎత్తున వ్యతిరేకించినప్పటికీ మొండిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా  కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కార్మిక చట్టాల్లో  తీవ్రమైన మార్పులు తీసుకొచ్చారు . రైతు,  ప్రజా, కార్మిక వ్యతిరేక చట్టాల మూలంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికీ మోదీ వైఖరిలో మార్పు వచ్చినట్లు అగుపడట్లేదు. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వంలో 17 స్థానిక పార్టీల కూటమిలో ఉన్నందున ఎన్నికల గుణపాఠాలు నేర్చుకొని ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడాలి. మాకు ఎదురేలేదనే అహంకారాన్ని మోదీ, బీజేపీ వదులుకోవాలి.   

- ఉజ్జిని రత్నాకర్ రావు.
సీపీఐ సీనియర్​ నాయకుడు