గయానాకు మోదీ.. భారత ప్రధానికి ప్రెసిడెంట్​ అలీ ఘన స్వాగతం

జార్జ్​టౌన్​(గయానా): బ్రెజిల్​లో నిర్వహించిన జీ– 20 సమిట్​లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ.. అక్కడి నుంచి బుధవారం గయానాకు చేరుకున్నారు. 56 ఏండ్ల తర్వాత తమ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధానికి గయానా రాజధాని జార్జ్​టౌన్​లో ఘన స్వాగతంతో పాటు ‘గార్డ్​ ఆఫ్​ హానర్’​ లభించింది. విమానాశ్రయంలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్​ అలీతోపాటు, ప్రధానమంత్రి, డజనుకు పైగా కేబినెట్​ మంత్రులు మోదీకి స్వాగతం పలికారు.  భారత్–-గయానా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనంగా  ‘కీ టు ది సిటీ ఆఫ్ జార్జ్‌‌టౌన్’ కూడా అందజేసినట్టు  అధికారులు తెలిపారు. 

అధ్యక్షుడు అలీ ఆహ్వానం మేరకు గయానాకు వచ్చిన మోదీ.. గురువారం ఇక్కడే ఉండనున్నారు. ‘‘కొద్ది సేపటి కిందే గయానాలో దిగాను. విమానాశ్రయంలో నన్ను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన ప్రెసిడెంట్ డాక్టర్​ ఇర్ఫాన్​ అలీ, పీఎం మార్క్​ ఆంథోనీ ఫిలిప్స్, సీనియర్​ మంత్రులు, ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుతుందని నేను విశ్వసిస్తున్నా” అని మోదీ ఎక్స్​ (ట్విట్టర్) లో పోస్ట్​ చేశారు.  కాగా, ప్రెసిడెంట్​ అలీతో మోదీ భేటీ అయి ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన వ్యూహాత్మక విధానాలపై చర్చించనున్నారు.

రెన్యూవబుల్  ఎనర్జీపై ఆస్ట్రేలియాతో  భాగస్వామ్యం

బ్రెజిల్​లో జీ 20 సమిట్​ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్​తో  ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఇరుదేశాల రెండో వార్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. రెన్యూవబుల్​ఎనర్జీ భాగస్వామ్యం (ఆర్ఈపీ)పై ఆస్ట్రేలియా, భారత్​ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై ఇరుదేశాలు దృష్టిపెట్టాయి. రక్షణ, భద్రతా సహకారం, మొబిలిటీ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, ఎడ్యుకేషన్​లాంటి అంశాల్లో సహకారం అందించుకునే అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించారు. 2022లో ఇరుదేశాల మధ్య జరిగిన ఎకనామిక్​ కో ఆపరేషన్​ అండ్​ ట్రేడ్​ అగ్రిమెంట్​ (ఈసీటీఏ) పైనా చర్చించి, వేగంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.  

వేదాంతం టీచర్​కు అభినందన

బ్రెజిల్​లో వేదాంతం, భగవద్గీతకు ప్రచారం కల్పిస్తున్న జోనాస్​ మాసెట్టిని ప్రధాని మోదీ తన పరట్యనలో భాగంగా కలిశారు. మాసెట్టి స్థాపించిన ‘విశ్వవిద్య’ సంస్థ విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఎక్స్​లో మోదీ పోస్ట్​ చేశారు. ‘‘నేను విశ్వనాథ్​గా పిలుస్తున్న జోనాస్​ మాసెట్టి, అతడి బృందాన్నిఈ రోజు కలిశాను. గీతపై ఆయనకున్న మక్కువను చూశాను. అతడి బృందం నిర్వహించిన రామాయణ ప్రదర్శనను వీక్షించాను” అని వ్యాఖ్యానించారు.