ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారు : రాజాసింగ్

ఎల్లారెడ్డి బాన్సువాడ, ప్రచార సభలో కాంగ్రెస్ పై విమర్శలు 

బాన్సువాడ, వెలుగు: ముస్లిం మహిళలకు ప్రధాని మోదీ మేలు చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. త్రిఫుల్ తలాక్ తో ముస్లిం మహిళలకు ఎంతో అన్యాయం జరిగిందని, మోదీ త్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ చట్టం తేవడంతో వారికి ఎంతో మేలు జరిగిందన్నారు.  500 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న రామ మందిరం నిర్మాణం కల మోదీ హయాంలో సాకారమైందన్నారు.  370 ఆర్టికల్ తొలగించడం వల్ల కశ్మీర్ లో ప్రశాంతత నెలకొందన్నారు.  తీవ్ర వాదుల ముప్పు ఉండకూడదంటే బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. ఆయన వెంట జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్,  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గం ఇన్ చార్జి  యెండల లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పెద్దోళ్ల గంగారెడ్డి, శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. 

మూడోసారి మోదీయే ప్రధాని

ఎల్లారెడ్డి: మూడో సారి ప్రధానిగా మోదీని గెలిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలో రోడ్ షోలో మాట్లాడుతూ.. బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.  మూడోసారి ప్రధానిగా మోదీ కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మద్యం, డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమెరికా సిస్టం చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.. అక్కడ 10 ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుందని రెండిళ్లు ఉంటే ఒక ఇంటిని స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. కామారెడ్డిబీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు పాలించినా దేశానికి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో 10 నుంచి 14 సీట్లు గెలుస్తామని మళ్లీ మోదీ  ప్రధాని అవుతారన్నారు.