వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ అమోదం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. అదే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల్లో సంస్కరణలు తీసుకు వచ్చే ఉద్దేశంతో.. పార్లమెంట్, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు 2024, డిసెంబర్ 12వ తేదీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును.. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోని సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం పొందింది. 

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే.. ఆ తర్వాత రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే మాత్రం.. దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 100 రోజుల్లో అంటే.. 3 నెలల్లో దేశం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటర్ ఐడీ వ్యవస్థను కూడా రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 18లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగానూ కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తర్వాత.. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.