నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ

తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులవృత్తిగా ఉన్న పద్మశాలి, స్వకులశాలి, కుర్ని, కత్రి, జాండ్ర, దేవాంగ, తొగట, నేతకాని వర్గాలకు చెందిన వారందరినీ కలిపి నేతన్నలుగా వ్యవహరిస్తారు. గద్వాలలో నేతన్నలు నేసిన పట్టు వస్త్రాలను తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల వేళ సమర్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.  అంటే  తెలంగాణ  చేనేత  వస్త్రాలు అంత గొప్పచారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత కలిగి ఉన్నాయి.

అయితే, ప్రభుత్వాలు కులవృత్తులను కూడా యాంత్రికీకరణ బాటపట్టించి, ఆధునికీకరణ ఫలాలు అందిపుచ్చుకోవాలని చెప్పాయి. కానీ, నేతన్నలు వారి కులవృత్తి విషయంలో ఈ ఆధునికతను జోడించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పవర్లూమ్ పై తయారుచేసిన బట్ట ‘చేనేత’ కిందికిరాదు. 

టెక్నాలజీ బాటలో ఇతర కులవృత్తులు

 ఆధునిక టెక్నాలజీ సూత్రం వేరే కుల వృత్తులకు వరంగా మారింది. ఉదాహరణకి ఒక రజక కులానికి చెందిన లాండ్రీ షాప్ నిర్వాహకుడు బట్టలను ఉతకడానికి వాషింగ్ మెషీన్,  కరెంటుతో నడిచే ఇస్త్రీ పెట్టె వంటి కొత్త ఆవిష్కరణలను వాడుకొని తన శారీరక శ్రమను తగ్గించుకొని తన కులవృత్తిలోనే కొనసాగుతున్నాడు. ఒక నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ షాప్ లో కరెంటుతో నడిచే ఆధునిక పరికరాలు వాడుకొని తన కులవృత్తిలో సమర్థవంతంగా రాణిస్తున్నాడు.  ఒక వడ్రంగి తన వృత్తిలో భాగంగా తలుపుల తయారీలో, వాటిపై డిజైన్లను వేయడానికి అత్యాధునిక టూల్స్ వాడుతున్నాడు.

అలాగే ఒక గీత కార్మికుడు (గౌడన్న) తన కులవృత్తిని మధ్యలో విడిచిపెట్టినా లేదా అసలు ఇంతకుముందు ఆ వృత్తిని చేపట్టకున్నా, తను వైన్ షాప్ గానీ, కల్లు దుకాణంగానీ పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయా కులాలు ఆధునికీకరణను పుణికిపుచ్చుకుని మార్కెట్ లో ఎలా నిలదొక్కుకుంటున్నాయో లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని మచ్చు తునకలు. వీటికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి.
 
కుల (వృత్తి) సంఘంలో సభ్యత్వమే కీలకం 

ఎవరైనా వ్యక్తి కుల వృత్తులకు సంబంధించిన ప్రభుత్వ స్కీములు పొందాలంటే, వారికి  ప్రభుత్వ గుర్తింపు పొందిన కుల సంఘంలో సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. ఆ సభ్యత్వంతోనే  కుల వృత్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. బ్యాంకుల్లో లోను  కావాలన్నా, ఈ సభ్యత్వమే కీలకమన్నమాట.  కానీ, నేతన్నల విషయంలో,  కేవలం మగ్గంపై పని చేసేవారినే  నేత కార్మికులుగా గుర్తిస్తున్నారు. వారికి మాత్రమే చేనేత సహకార సంఘంలో సభ్యత్వం ఇస్తున్నారు.

 ఈ చేనేత వృత్తి లాభసాటి కాకపోవడం వల్ల చాలామంది వ్యక్తులు బట్టలను వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల్లో నుంచి కొనుక్కొచ్చి, ఆడవారైతే వారి ఇంట్లోనే చిన్న దుకాణం పెట్టుకోవడం,  మగవారైతే  చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి బట్టలు అమ్మడం ద్వారా జీవనం గడుపుతున్నారు. ఇలా, నేతన్నల కుటుంబ సభ్యులు వారి ఉపాయాన్ని బట్టి రకరకాల పనులను చేసుకుని పొట్టపోసుకుంటున్నారు.

కానీ, చేనేత సంఘంలో సభ్యత్వం లేకపోవడం వల్ల నేతన్న వర్గంలోని వారందరూ ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారాలి. ఇతర కులాలకు ఇచ్చినట్టుగా, నేతన్న వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలి. 

 మన సంస్కృతిలో వస్త్రానిది విశిష్ట స్థానం

మనిషి తల్లి గర్భం నుంచి భూమిపై పడినప్పటి నుంచి మళ్లీ భూగర్భంలోకి వెళ్లేవరకు వస్త్రంతో అవినాభావ సంబంధం ఉంటుంది.  రకరకాల పండుగలు, పబ్బాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, సన్మానాలు,  గృహ ప్రవేశం, మానవ జీవితంలోని ముఖ్య ఘట్టాలైన సీమంతం, నూతన ఫల పుష్పాలంకరణ, పెళ్లి,  చివరకు చనిపోయిన తర్వాత, తదితర సందర్భాల్లో కొత్త బట్టలకు ఎంత స్థానం  ఉంటుందో  వేరే చెప్పనక్కరలేదు. వస్త్రానికి, సంస్కృతికి మధ్య ఉన్న సంబంధాన్ని వస్త్ర వ్యాపారవేత్తలు ముందుగానే పసిగట్టారు.

అందుకే ఒకప్పుడు హైదరాబాద్​లో  మాత్రమే ఉండే  పెద్దపెద్ద  షాపింగ్ మాల్స్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పాగా వేస్తున్నాయి. ఈ షాపుల్లో  దేశవ్యాప్తంగా జీఐ  గుర్తింపు పొంది, పేరుగాంచిన ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన చేనేత చీరలకు, ఇతర వస్త్రాలకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు.  మరీ ముఖ్యంగా పెళ్లి ళ్ల సీజన్లో, తర్వాత శ్రావణం, -ఆషాఢ మాసాల్లో, వివిధ పండగ సమయాల్లో ఈ షాపులు కిక్కిరిసిపోయి  బిజినెస్ కోట్ల రూపాయల్లో జరుగుతోంది.

 కానీ, కష్టపడి మగ్గంపై చీరలు నేసిన నేత కార్మికుడికి మిగిలేది ఏమీ లేదు. చాలా సందర్భాల్లో వారు పస్తులు కూడా ఉంటున్నారు.  ఇటువంటి ఈ వ్యవస్థ మారాలి. కావున  చేనేత సహకార సంఘాలు, నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మీ షో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ వేదికల ద్వారా నేరుగా వినియోగదారులకు  విక్రయించుకునే విధంగా ప్రభుత్వం నేతన్నలకు శిక్షణ ఇవ్వాలి. చేనేత రంగానికి వరంగా మారాల్సిన ఆధునిక టెక్నాలజీ ప్రస్తుతమున్న చట్టాలు, -మార్గదర్శకాల వల్ల నేతన్నల పాలిట ఒక శాపంలా తయారైంది.

నేతన్న వర్గాలకు చెందిన వారు ఎవరైనా చేనేత- వస్త్ర రంగాల్లో పనిచేస్తే చాలు, వారిని  ప్రభుత్వం నేత కార్మికునిగా గుర్తించాలి.  రాష్ట్రంలో  చేనేతరంగ గతమెంతో ఘనం, కానీ, నేడు బతుకుదెరువే కరువైన కఠిన వాస్తవ  పరిస్థితుల్లో నేతన్నలున్నారు.  రెక్కాడితే గానీ డొక్కాడని నేతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. 

నేతన్నలకు వర్తించని ఆధునికీకరణ

ఆధునికీకరణ మంత్రం నేతన్నలకు మాత్రం వర్తించడం లేదు. అందువల్ల నేతన్నలు వారి కులవృత్తిలో టెక్నాలజీని అంతగా జొప్పించలేకపోతున్నారు. ప్రభుత్వాలేమో కేవలం ‘చేతుల’తో  నేసినటువంటి వస్త్రాన్ని మాత్రమే చేనేతగా పరిగణిస్తూ, ఎటువంటి కరెంటు వినియోగించకుండా సంప్రదాయ మగ్గాలపై పనిచేసేవారిని మాత్రమే చేనేత కార్మికులుగా గుర్తిస్తోంది.  అందువల్ల కొత్త తరం వ్యక్తులు కూడా ఈ వృత్తిలోకి రాలేకపోతున్నారు. ఈ వృత్తి అంతరించిపోవడానికి, త్వరలో కనుమరుగు కావడానికి ఇదొక కారణం.

మరోవైపు ఇతర కులాల వారు కులవృత్తి చేయనప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే  సబ్సిడీలు గానీ ఇతర పథకాలు గానీ అందుతున్నాయి. ఉదాహరణకు గౌడ్ సామాజిక వర్గంలోని వ్యక్తులందరికీ, వారు చేసే వృత్తితో సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘంలో సభ్యత్వం ఉంటుంది.  అలాగే చేపలు పట్టడమే కులవృత్తి అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఏడాది పొడవునా ఆ వృత్తిలో ఉండరు. నిజానికి వారిలో చాలామంది వేరే పనులు చేస్తూనే,  ఎండా కాలంలోనే ఎక్కువగా చేపలు పట్టే పనిలో నిమగ్నమవుతారు. అయినా కూడా ఆ వర్గపు వ్యక్తులందరికీ,  వారి కుల సంఘంలో సభ్యత్వం ఉంటుంది.  దానికి ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుంది. 

డా. శ్రీరాములు గోసికొండ,
 సోషల్ ఎనలిస్ట్​