మిర్యాలగూడ సభ ఆరంభం మాత్రమే.. అసలు ఉద్యమం పరేడ్ గ్రౌండ్‌లో ఉంటది: తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెనుక బడిన కులాలను ఐక్యం చేయడానికి మరిన్ని మీటింగ్ ఉంటాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మిర్యాలగూడ సభ ఆరంభం మాత్రమేనని.. అసలు ఉద్యమం పరేడ్ గ్రౌండ్‌లో ఉంటదని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని NSP క్యాంపు మైదానంలో బీ.సీ గర్జన సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. బీసీలను అణచి వేయడానికి, రేపు పత్రికలలో వార్త రాకుండా ఉండటానికి దామరచర్ల మంత్రుల పర్యటన పెట్టారని ఆయన చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే BLR కుట్రలు, కుతంత్రాలు ప్రత్యక్షంగా చూశానని తీన్మార్ మల్లన్న చెప్పారు. బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడకు చివరి OC ఎమ్మెల్యే అవుతారని ఆయన సభలో మాట్లాడారు. రానున్న కాలంలో మిర్యాలగూడకు బీసీ ఎమ్మెల్యే అవుతాడని చెప్పారు.

Also Read :- రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వీకెండ్‌లో 513 మంది..

తీన్మార్ మల్లన్న ఎవరి దయాదాక్షిన్యాలతో గెలవలేదని.. తన పనితనం నచ్చకపోతే ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. కేవలం బీసీల ఓట్లతోనే గెలిచానని.. నల్లగొండ జిల్లాలో బీసీలను అనగదొక్కి గెలిచిన నేతలను.. వచ్చే ఎన్నికలలో గెలవనివ్వనని ఆయన అన్నారు. ఉద్యోగాల్లో BCలకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీలు అంటే బిగ్ క్లాస్. OCలు బీసీల ఓట్లు అడగొద్దని.. బీసీలు కూడా ఓసీల ఓట్లు అడగమని ఆయన చెప్పుకొచ్చారు. రానున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BCలకే ఓటు వేసే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రత్యేక తెలంగాణ వచ్చినా వారి రాతలు మారలేదని తీన్మార్ మల్లన్న అన్నారు.