ఇయ్యాల్నే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు

  • పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్ 
  • ఎక్స్​అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1,439 ఓట్లు 
  • 10 పోలింగ్ ​సెంటర్లు ఏర్పాటు
  • బీఆర్ఎస్​కు సంఖ్యా బలం ఉన్నా.. క్రాస్​ ఓటింగ్​పై టెన్షన్​ 

మహబూబ్​నగర్/కొడంగల్, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్​నగర్ లోకల్​ బాడీస్ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఉప ఎన్నిక జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి కేడర్​లో జోష్​ నిపేందుకు అధికార పార్టీ.. సిట్టింగ్​స్థానాన్ని చేజార్చుకోరాదని బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లకు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తుండడంతో రాష్ర్టవ్యాప్తంగా ఈ ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ ఎలక్షన్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు లోకల్ ​బాడీస్ ప్రజాప్రతినిధులను వారం రోజులుగా గోవా, ఊటీ, కొడైకెనాల్, నెల్లూరు, కర్నాటకలోని పలు ప్రాంతాలకు తరలించాయి.  

వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ ​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం పోలింగ్ ఉండడంతో వీరిని బుధవారం తెల్లవారుజామున​ క్యాంపుల నుంచి తరలించినట్లు తెలిసింది. రాత్రికి సొంత ప్రాంతాలకు కాకుండా.. హైదరాబాద్​లోని రిసార్టుల్లో ఉంచినట్లు సమాచారం. గురువారం ఉదయం బ్రేక్​ఫాస్ట్ తర్వాత అందరినీ స్పెషల్ బస్సుల్లో నేరుగా పోలింగ్ సెంటర్లకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా ప్లాన్​ చేసినట్లు తెలిసింది. 

కొడంగల్ లో ఓటేయనున్న సీఎం రేవంత్​రెడ్డి 

మహబూబ్​నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్​లో గురువారం ఓటు వేయనున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి కొడంగల్​లో పర్యటించి మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్​ ఏర్పాట్లను పరిశీలించారు. 

క్రాస్ ఓటింగ్​పై టెన్షన్​ 

లోకల్​ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు క్రాస్​ఓటింగ్ టెన్షన్​ పట్టుకుంది. ఒక్కో ఓటుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డీల్​ కుదిరిందని సమాచారం. అయితే, వీరంతా చివరి నిమిషంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే దానిపై క్యాండిడేట్లలో ఉత్కంఠ నెలకొన్నది. ఈ స్థానంలో అత్యధికంగా బీఆర్ఎస్​కు 904 మంది ప్రజా ప్రతినిధుల బలం ఉండగా, కాంగ్రెస్​కు 369 మంది, బీజేపీకి120, ఇతరులు 46 మంది ఉన్నారు. క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మూడు రోజుల కింద పార్టీ నేత కేటీఆర్ సమావేశమై ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. కానీ, రెండు నెలల ముందు నుంచే ఈ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ లీడర్లకు టచ్​లోకి వెళ్లినట్టు తెలిసింది. మొత్తానికి ఏప్రిల్ 2న జరిగే ఓట్ల లెక్కింపుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. 

పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

బైపోల్​కు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలమూరు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 795 మంది మహిళలు, 644 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 449 మంది కౌన్సిలర్లు,  83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియోలుగా ఓట్లు వేయనున్నారు.

ఎన్నికల కోసం మహబూబ్​నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్​నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ ​ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. బ్యాలెట్ ద్వారా ప్రజా ప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రంగా అన్ని పోలింగ్​ సెంటర్లకు ఎలక్షన్ ​మెటీరియల్​ను తరలించారు. ప్రతి సెంటర్​కు ఒక మైక్రో అబ్జర్వర్​ను నియమించడంతో పాటు అదనంగా మరో ఐదుగురిని అందుబాటులో ఉంచారు.