జన్వాడ ఫామ్ హౌస్​ కేటీఆర్​దే : మహేష్​కుమార్​ గౌడ్​

  • ఆయన భార్య శైలిమ పేరుపైనే రిజిస్ట్రేషన్ : మహేష్​కుమార్​ గౌడ్​
  • తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : జన్వాడ ఫామ్​హౌస్ కేటీఆర్ దేనని, అది ఆయన భార్య కల్వకుంట్ల శైలిమ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ  మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పేరుకే ఇది ప్రదీప్​రావుది అంటున్నారని, అది ముమ్మాటికీ కేటీఆర్​ఫామ్​హౌసేనని తేల్చి చెప్పారు. బుధవారం మహేశ్​కుమార్​గౌడ్​ గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు.  గతంలో ఈ ఫామ్​ హౌస్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి, 14 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు.

ఆ ఫామ్​హౌస్ పై  రేవంత్ డ్రోన్ లు తిప్పాడని అంటున్న వారు..  మరి ఆ సమయంలో అక్కడ కేటీఆర్ ఎందుకున్నాడో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎఫ్ టీఎల్ జోన్ లో ఉన్న ఈ భూమిలో  దీన్ని ఎలా కడతారని ప్రశ్నించారు. ఫిరంగి నాలాను పూడ్చేసి జన్వాడ ఫామ్​హౌస్ కట్టారని ఆరోపించారు. ఇంద్ర భవనంలా దీన్ని నిర్మించారని చెప్పారు. మున్సిపల్ మంత్రిగా పని చేసిన కేటీఆర్ కు గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలియదా? అని ఫైర్ అయ్యారు.

కేటీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. పదేండ్లపాటు యథేచ్ఛగా విధ్వంసం చేసి, సర్కారు భూములను ఆక్రమించుకున్నారని, పట్టాలో పేరు మార్చి ప్రైవేట్ పరం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యమం ముసుగులో భూములపై కన్నేశారని ఆరోపించారు. 

హైడ్రా వెనక్కి తగ్గొద్దు

ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా కాపాడే ప్రయత్నం చేస్తున్నదని మహేశ్​కుమార్​గౌడ్​ చెప్పారు. తప్పుచేస్తే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదని పేర్కొన్నారు. హైడ్రా వెనక్కి తగ్గకుండా పనిచేయాలని కోరారు. హైడ్రా కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే  దాన్ని డైవర్ట్  చేసేందుకే బీఆర్ఎస్​ నేతలు విగ్రహాల ఇష్యూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని పేర్కొన్నారు.

 ఇచ్చిన మాట ప్రకారం తమ సర్కారు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. కేవలం 8 నెలల్లోనే రుణమాఫీ చేసినట్టు తెలిపారు. కొన్నిచోట్ల టెక్నికల్ సమస్యలతో కొందరికి రుణమాఫీ డబ్బులు జమకాలేదని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.