బోధన్ ​హాస్టల్ ​ఘటన దురదృష్టకరం : కల్వకుంట్ల కవిత

కామారెడ్డి, వెలుగు: బోధన్​లోని హాస్టల్​లో జరిగిన ఘటనలో స్టూడెంట్​చనిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గాంధారి మండలం తిప్పారం తండాలో హత్యకు గురైన డిగ్రీ స్టూడెంట్​బన్సీ వెంకట్​కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. అనంతరం కామారెడ్డి సమీపంలో కవిత మీడియాతో మాట్లాడారు. బోధన్​ హాస్టల్​లో విద్యార్థి మర్డర్​ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. 

ప్రభుత్వంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. రేవంత్​రెడ్డికి కేసీఆర్ ను విమర్శించడం తప్పా వేరే పని లేదన్నారు. హాస్టల్స్​లో హోంగార్డులను సెక్యూరిటీగా పెట్టాలన్నారు. మృతుడు వెంకట్​ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం, ఇల్లు, అతడి తల్లికి ఫించన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఒకటేనని, నిన్నటి ఆదిలాబాద్​సభలో రేవంత్​రెడ్డి మోదీని పెద్దన్న అని సంబోధించడంతో నిజం బయటపడిందన్నారు. బడ్జెట్​లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఈ విషయమై సీఎం ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబోద్దీన్, లీడర్లు నిట్టు వేణుగోపాల్​రావు, వేణుగోపాల్​గౌడ్, ప్రేమ్​కుమార్, తానాజీరావు, ప్రభాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.