జగిత్యాల, వెలుగు: దొంగే పోలీసులను బెదిరించినట్టుగా కేసీఆర్ తీరు ఉన్నదని, విచారణకు హాజరు కాకపోవడం నేరాన్ని అంగీకరించనట్టే అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జ్యుడీషియల్ కమిషన్‌ను ధిక్కరించడంతోపాటు కేసీఆర్ తనను తాను సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జీవన్‌రెడ్డి మాట్లాడారు.
విచారణ అధికారి నరసింహా రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌నే వైదొలగాలని అనేందుకు నువ్వెవరివి?” అని కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం అందుకున్నారని, బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్లలో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో చెప్పాలని అడిగారు.
సోలార్ పవర్ యూనిట్ మూడు రూపాయలకే లభిస్తుందని, యాదాద్రి థర్మల్ ప్లాంట్ అసలు అవసరం లేదని నర్సింహారెడ్డి అనడంతో కేసీఆర్‌కు భయం పట్టుకున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, సీనియర్ నాయకులు గిరి నాగ భూషణం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.