కొత్త రెవెన్యూ చట్టం భూసమస్యలకు పరిష్కారం చూపాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కండ్లు, చెవులు
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నూతన ఆర్ఓఆర్ చట్టంపై
  • ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు

కరీంనగర్, వెలుగు: గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్​తో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, కొత్త రెవెన్యూ చట్టం భూసమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదాపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్​లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు జీవన్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కండ్లు, చెవులని, గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను కూడా పటిష్టం చేసి, మంచి చట్టం ద్వారా తెలంగాణ ప్రజలకు మేలైన సర్వీసులు అందిస్తామన్నారు. ట్రెసా ప్రయత్నాన్ని అభినందిస్తూ వారందించే సూచనలన్నింటినీ సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి చట్టంలో పొందుపరిచేలా ప్రయత్నిస్తానన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలను, పట్టాదారులకు అందించాల్సిన సర్వీసులను వివరించారు. 

ప్రజాభిప్రాయ సేకరణ శుభపరిణామం : వంగ రవీందర్ రెడ్డి 

ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు వివిధ వర్గాల నుంచి  సూచనలు తీసుకోవడం శుభపరిణామమని, అలాగే నూతన చట్టం అమలుకు సంబంధించి అసోసియేషన్ ద్వారా తగిన సూచనలు చేస్తామన్నారు. రైతులకు మరిన్ని సేవలు అందించడానికి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులంతా ముందుంటారని చెప్పారు. కొత్త చట్టంలో ఆర్డీవో అప్పిలేట్ అథారిటీగా ఉండాలని, కలెక్టర్ స్థాయిలో రివిజన్​కు అవకాశం ఉండాలని సూచించారు. సమగ్ర భూసర్వే నిర్వహించాలని కోరారు. 

సదస్సులో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ప్రజామిత్ర కొరివి వేణుగోపాల్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, మెట్​పల్లి ఆర్డీవో శ్రీనివాస్, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర కమిటీ సభ్యుడు రియాజ్, నిరంజన్, చైతన్య, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లు, రియల్ ఎస్టేట్, క్రెడాయ్, రైతు సంఘాల ప్రతినిధులు ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లును స్వాగతిస్తూ విలువైన సూచనలు చేశారు.