కౌశిక్‌రెడ్డి స్కామ్లను బయటపెడతాం:ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

  • హుజూరాబాద్ లో దళితబంధు రాకుండా అడ్డుకున్న ద్రోహి
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

జమ్మికుంట, వెలుగు:  హుజురాబాద్ లో దళిత బంధు పేరిట దళితులను మోసగిస్తూ రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్కామ్ లను త్వరలోనే బయటపెడతామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బుధవారం కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ..  గత ఎన్నికల్లో హుజురాబాద్ లో దళిత బంధు రాకుండా అడ్డుకున్న దళిత ద్రోహి పాడి కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు. 

దళిత బంధు పేరిట అనేక అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా అనేక స్కామ్ లు చేశారని, వాటన్నింటిని త్వరలోనే ఆధారాలతో బయటపెడతామని ఆయన స్పష్టంచేశారు. బై పోల్ సమయంలో ఇందిరానగర్ – శాలపెళ్లి గ్రామాల మధ్య ప్రచారానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. రూ. పది లక్షలు ఇస్తామని  బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినా ఇవ్వలేదన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, రాబోయే రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో దళితులకు దళిత బంధు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే జనవరి నుంచి హుజరాబాద్ లో పర్యటిస్తారని, ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కసుబోజుల వెంకన్న, శ్రీనివాస్, శ్రీకాంత్ ఉన్నారు.