బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో అభివృద్ధి జరగలె... వివేక్‌‌‌‌ వెంకటస్వామి

  • మిషన్‌‌‌‌ భగీరథలో కమీషన్ల పేరిట దోపిడీ
  • ఈ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్ల ప్రజాధనం వృధా చేశారని ఫైర్​
  • అమృత్ స్కీం ద్వారా ఇంటింటికి తాగునీటి సప్లయ్‌‌‌‌
  • చెన్నూరు, క్యాతనపల్లిలో రూ.71.50 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు
  • పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు అమృత్ 2.0 స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ గెర్రె కాలనీలో రూ.30 కోట్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్స్‌‌‌‌లో రూ.41.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమృత్ 2.0 తాగునీటి పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ పదేండ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. తాగు నీటి కోసం తెచ్చిన మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని గత నాలుగేండ్లుగా తాను చెబుతూనే ఉన్నానన్నారు. కమీషన్ల కోసమే గత బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిందని, దీని వల్ల రూ.40 వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఎక్కడా రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. మిషన్​భగీరథకు సంబంధించి పైపులు ఎక్కడ డ్యామేజ్ అయ్యయో వాటిని మార్చాలని అధికారులను ఆదేశించానని చెప్పారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు చెన్నూరులో తాగు నీటి కోసం రూ.14 కోట్లు కేటాయిస్తే, అప్పుడు నాసిరకమైన పైపులు వేసి గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చెప్పారు. మరోవైపు, క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో తాగు నీటి సమస్యను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన చొరవతోనే అమృత్ స్కీం మంజూరైందని వివేక్‌‌‌‌ పేర్కొన్నారు. వంశీకృష్ణ తన ఎంపీ ల్యాడ్ నుంచి ఎక్కువ నిధులు​చెన్నూరుకు ఇవ్వాలన్నారు.

చెన్నూరులో 2 వేలు, క్యాతనపల్లిలో 5 వేల ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మందమర్రి మున్సిపాలిటీకి కూడా రూ.30 కోట్ల ఫండ్స్ మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా లేఅవుట్లు, సైడ్ డ్రైన్స్, రోడ్లు లేకపోతే ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వొద్దని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 

స్కీమ్‌‌‌‌ల పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ స్కామ్‌‌‌‌లు: వంశీకృష్ణ 

మున్సిపాలిటీల్లో డ్రికింగ్ వాటర్ సప్లై కోసం అమృత్ స్కీంను తీసుకురావడం ఆనందంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో ప్రజలు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూశానని, కాంగ్రెస్ సర్కార్ వస్తే తమకు తాగు నీళ్లు అందించాలని గ్రామాల్లో మహిళలు అడిగారని గుర్తుచేశారు. పదేండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ స్కీమ్‌‌‌‌ల పేరుతో వేల కోట్ల స్కామ్‌‌‌‌లు చేసిందని ఆరోపించారు.

మిషన్ భగీరథ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు త్వరగా పూర్తి చేసి ఏడాదిలోపు తాగు నీటిని అందించాలని కాంట్రాక్టర్, ఆఫీసర్లను ఎంపీ ఆదేశించారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ క్యాతన్‌‌‌‌పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేయలేకపోయిందన్నారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఫండ్స్ మంజూరు చేయించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్లు అర్చన గిల్డా, జంగం కళ తదితరులు హాజరయ్యారు.