రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్  ప్రభుత్వం నిరంతరం సేవలు అందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్‌‌ విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్ట సింగిల్ విండో సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

వానకాలం సీజన్‌‌ నుంచి సన్న రకాల వడ్లకు  రూ.500 బోనస్‌‌గా చెల్లిస్తామన్నారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుల సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ధూళికట్ట, జూలపల్లి ప్యాక్స్ చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్‌‌రావు, గండు సంజీవ్, డైరెక్టర్లు, పార్టీ లీడర్లు, రైతులు పాల్గొన్నారు.