ఏడాది పాలనలో అనేక అభివృద్ధి పనులు : వేముల వీరేశం 

నకిరేకల్, వెలుగు : కాంగ్రెస్​ఏడాది పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని సత్య సాయి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఏడాదిలో జిల్లాకు అత్యధిక నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులకు కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నామన్నారు.

మూసీ ప్రక్షాళన కూడా జరిగి తీరుతుందని, మూసీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో నకిరేకల్ లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రిని పూర్తిచేస్తామని, నకిరేకల్ పట్టణంలోని ప్రధాన రోడ్డు అభివృద్ధి చేస్తామని, ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని, దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు.

త్వరలో కడపర్తి రోడ్డును రెండు లైన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ బోల్ల వెంకట్ రెడ్డి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు రజితాశ్రీనివాస్, కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.