నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలోని అభయాంజనేయ స్వామి ఏకశిల శివ పంచాయతన సహిత దేవాలయం, అంజనాద్రి క్షేత్రం వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ దాత, నిర్వాహకుడు కిషోర్ కుమార్ ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేసి సన్మానించారు.
ఎమ్మెల్యే వెంట పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు పాల్గొన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజనాద్రి ఆలయం దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందని, రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగడం ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకుడు కిషోర్ కుమార్ ను అభినందించారు. అంజనాద్రి క్షేత్రంలో జడ్పీ మాజీ చైర్మన్ రాజు పూజలు చేశారు.