బాన్సువాడ, వెలుగు: కాంగ్రెస్ కంటే 8 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారతాయని, సంకీర్ణ యుగం ఆరంభమవుతుందన్నారు.
బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుందని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని ధాన్యం కొనుగోలు జరగడంలేదని కేసీఆర్ పాలన బాగుందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జహీరాబాద్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుస్తారని.. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్, పోతారెడ్డి నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.