బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి మాట్లాడారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నానని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారుల నివేదికల ప్రకారం ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 8082 మంది రైతులు నుంచి 65,932 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 67, 901 మంది రైతుల నుంచి 4, 98,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, కామారెడ్డి ఒక్క జిల్లాలో 30640 మంది రైతుల నుంచి 2,10,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 37,261 మంది రైతుల నుంచి 2,87,523 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూన్ 23న నిజాంసాగర్ నీటిని సకాలంలో ఉపయోగించుకోవడంతో రైతులు ముందస్తు నారుమడులు వేసుకోవడంతోనే కోతలు ముందుగానే వచ్చాయన్నారు.

సందర్భంగా ఒక రైతుగా, రైతు శ్రేయోభిలాషి సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 25 సొసైటీలో దాదాపు అన్నింటిలోనూ ధాన్యం కొనుగోలు పూర్తి కావస్తుందని, చింతకుంట, గోవూరు, హుమ్నాపూర్, వర్ని సొసైటీల్లో  ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. మైలారం, బైరాపూర్, దేశాయిపేట, దుర్కి సొసైటీల్లో ఒకటి, రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి అవుతాయన్నారు.

మిగతా సోసైటీల్లో ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇళ్లను మంజూరు చేస్తామని, నియోజకవర్గంలో ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. యాసంగి పంటకు సైతం నిజాంసాగర్ నీరు నిండుగా ఉండడంతో రైతులకు నీటిని సకాలంలో అందిస్తామని, నారుమడులు వేయడానికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు.

నవంబర్ లో నారుమడులు పోసుకుంటేనే పంట చివరి కాలంలో వచ్చే వడగళ్ల వాన నుంచి పంట నష్టం జరగకుండా ఉంటుందని రైతులకు సూచించారు. కాగా, ధాన్యం బోనస్ వచ్చిన రైతులు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి, నాగులగామ వెంకన్న, ఎజాస్ పాల్గొన్నారు.