రైతుల కోసమే సొసైటీల అభివృద్ధి : ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్, వెలుగు : రైతుల కోసమే కో-ఆపరేటివ్ సొసైటీలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సాలూర, సాలంపాడ్​ గ్రామాల్లో సొసైటీ భవనాలు ప్రారంభించి,  గోడౌన్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. సాలూరలో రూ.13.5 లక్షలతో సొసైటీ అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.15 లక్షలతో  నిర్మించిన రైతుల విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసమే సొసైటీ భవనాలు, గోదాంల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సొసైటీలో తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పంటల మార్పిడి చేయాలని, ఆర్మూర్, బాల్కొండ మండలాల్లో ఏడాదికి నాలుగు పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. కూరగాయాల పంటల సాగుకు ప్రభుత్వం 50శాతం సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు.  

రైతులు చెరుకు సాగుపై దృష్టి పెట్టాలి..

బోధన్​లోని నిజాం షుగర్​ ఫ్యాక్టరీని పున:ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే రైతులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఆలోచనతో ఫ్యాక్టరీపై ఉన్నా  రూ.190 కోట్లు అప్పు చెల్లించినట్లు వివరించారు. చెరుకు కొత్తరకం వంగడాలు వస్తున్నట్లు తెలిపారు. 5500 చెరుకు మొక్కలు ఒక్క ఎకరం భూమిలో పెట్టుకోవచ్చన్నారు. చెరుకును కటింగ్ ​కోసం హార్వేస్టింగ్​ మిషన్లు వచ్చాయని పేర్కొన్నారు. 

క్రికెట్ టోర్నమెంట్​ ప్రారంభం..

సాలూర మండల కేంద్రంలోని సీజన్​-4 క్రికెట్​ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. సాలూర సొసైటీ చైర్మన్​ జనార్దన్ ను అభినందించారు. ఐడీసీఎంఎస్​ చైర్మన్​ తారాచంద్​ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్​అంతిరెడ్డిరాజరెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్ పర్సన్​అంకుసంద్యా, వైస్​ చైర్మన్​ శంకర్​, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దవార్ గంగారెడ్డి, శరత్,  బోధన్, కాంగ్రెస్​ సాలూర మండలాధ్యక్షుడు నాగేశ్వరరావ్, మందర్నా రవి పాల్గొన్నారు.

నవీపేట్: చిన్న చిన్న లోపాలతో రుణమాఫీ కాని రైతులకు ఆలస్యమవుతోందని ఎమ్మెల్యే, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని బినోల సొసైటీ అధ్వర్యంలో లింగాపూర్, నాల్లేశ్వర్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన గోదాంలను ప్రారంభించి మాట్లాడారు. సొసైటీ ఆధ్వర్యంలో గోదాంలు, విశ్రాంతి గదులు నిర్మించడంపై, చైర్మన్ హన్మాండ్లు, పాలక వర్గాన్ని అభినందించారు. నాలేశ్వర్ గ్రామస్తుల వినతి మేరకు రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని, ప్రభుత్వ స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

నాలేశ్వర్ లో పశు వైద్యుడిని నియమిస్తానని, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ వెంకట రమణ, ఎంపీడీవో నాగనాథ్, పాలకవర్గ సభ్యులు, సొసైటీ సీఈవో రమేశ్, కాంగ్రెస్ మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.