ఎవరూ అడ్డుకున్నా రామగుండం అభివృద్ధి ఆగదు :ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: ప్రతిపక్షాలు అడ్డుపడ్డా రామగుండంలో అభివృద్ధి ఆగదని, ఇప్పటికే రూ. 280 కోట్ల టెండర్లు ముగిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ఠాకూర్ తెలిపారు. శనివారం గోదావరిఖనిలోని క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం అభివృద్ధి కోసం రూ.100 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, రూ.100 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, మరో రూ.12 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి పనులు జరుగనున్నాయని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.140 కోట్లతో నూతన బిల్డింగ్ పనులు జరుగుతున్నాయని, రామగుండంలో నర్సింగ్ కాలేజీకి జీవో విడుదల అయ్యిందని వెల్లడించారు.

రూ.10 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుందని, ఇది చారిత్రాత్మకమని, ఎన్టీపీసీలో గత ప్రభుత్వం వదులుకున్న 2,400 (800 మెగావాట్ల మూడు యూనిట్లు) మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్​కు కాంగ్రెస్​  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మేయర్​ అనిల్​ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, ప్లోర్​ లీడర్ మహంకాళి స్వామి, ముస్తఫా, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్​ పాల్గొన్నారు. అనంతరం రామగుండం మండల పరిధిలో 235 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.