కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామేల్​

తుంగతుర్తి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేల్​సూచించారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న వడ్లకు క్వింటాల్​కు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. 

రైతులు దళారులను నమ్మి  మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని చెప్పారు. రైతుల పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకన్నయాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుమలరావు, సోమిరెడ్డి, సతీశ్, రైతులు, ఐకేపీ నిర్వాహకులుపాల్గొన్నారు.